China: ప్రపంచానికి చైనా సమర్పించు..‘భూ’చి చట్టాలు ..!

చైనా చుట్టుపక్కల దేశాలను వేధించడం మానుకోనే ఆలోచనే లేదు. ఈ ఏడాది ఆ దేశం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద చట్టాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ‘కోస్టు గార్డు చట్టం’, ‘మారిటైమ్‌ లా’ పేరిట దక్షిణ చైనా సముద్రాన్ని మింగేసేందుకు రంగం సిద్ధం చేసింది

Updated : 29 Oct 2021 14:54 IST

 ‘ల్యాండ్‌ బోర్డర్‌ లా’తో ఎల్‌ఏసీ వద్ద ‘జూలియన్‌ ఫిలిప్పే ద్వీపం’ పరిస్థితి తలెత్తనుందా..? 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చుట్టుపక్కల దేశాలను వేధించడం మానుకొనే ఆలోచనే అసలు చైనాకు లేదు. ఈ ఏడాది ఆ దేశం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద చట్టాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ‘కోస్టు గార్డు చట్టం’, ‘మారిటైమ్‌ లా’ పేరిట దక్షిణ చైనా సముద్రాన్ని మింగేసేందుకు రంగం సిద్ధం చేసింది. తాజాగా ‘ల్యాండ్‌ బోర్డర్‌ చట్టం’ పేరుతో మరో చట్టాన్ని చేసింది. దీంతో సరిహద్దు దేశాలతో జగడాలను హింసాత్మకంగా మార్చాలని చూస్తోంది.  ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందించారు. ‘‘ఇది సాధారణ, అంతర్గత చట్టం. అది మా వాస్తవిక అవసరాలను నెరవేరుస్తుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగానే అది ఉంది’’ అని పేర్కొన్నారు. తన దేశంలో చట్టాలు చేసుకొని.. అంతర్జాతీయ జలాలు, పొరుగు దేశాల భూభాగాల్లో వాటిని అమలు చేయాలని యత్నించడం ఓ రకంగా తెంపరితనమే. గతంలో కోస్ట్‌గార్డ్‌ చట్టంపై ప్రపంచ దేశాల నుంచి అభ్యంతరాలు వచ్చినప్పుడు ఇదే వాంగ్‌ వెన్‌బిన్‌ అచ్చం ఇలానే స్పందించారు. కానీ, ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌ తీరంలో చేస్తోన్న అరాచకం ప్రపంచం మొత్తం చూస్తోంది.

దక్షిణ చైనా సముద్రంలో అరాచకం సృష్టించేలా ‘కోస్ట్‌గార్డ్‌ లా’..!

చైనా ఈ ఏడాది జనవరిలో సరికొత్త కోస్టుగార్డు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. గతంలో ఉన్న వేర్వేరు దళాలను కలిపేసి కోస్టుగార్డ్‌ విభాగాన్ని సృష్టించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రకటించుకొన్న ప్రదేశాల్లోకి ఇతర దేశాల నౌకలు వస్తే వాటిని ధ్వంసం చేసేందుకు కోస్టుగార్డుకు అనుమతులు ఇచ్చింది. ముఖ్యంగా చైనా నిర్మించిన కృత్రిమ దీవులను ఈ దళం రక్షిస్తోంది. ఆ ప్రదేశాల్లోకి వచ్చే విదేశీ నౌకలను తనిఖీలు చేయడానికి అధికారం కూడా ఉందని పేర్కొంది. ఈ దళం కృత్రిమ ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్లను సృష్టించవచ్చు. అయితే.. ఎక్కడైన చైనా కోస్టుగార్డు ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్లను ఎలా సృష్టిస్తుందో అర్థంకాదు. దీనిపై జపాన్‌ అప్పట్లోనే తీవ్రంగా స్పందించింది. ఈ చట్టం అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనలకు కారణం కాకూడదని పేర్కొంది. వాస్తవానికి 2012లో దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌ మత్స్యకారులను చైనా అడ్డుకొంది. దీంతో అదే ఏడాది ఫిలిప్పీన్స్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2016లో చైనాకు ఎటువంటి హక్కు లేదని తీర్పు వెలువడింది. కానీ చైనా ఈ తీర్పును అమలు చేయలేదు.

చైనా నైన్‌డాష్‌ లైన్‌ పరిధిలోని దక్షిణ చైనా సముద్రం తనదే అని చెబుతోంది. రెండు వేల సంవత్సరాల క్రితమే తమ నావికులు ఈ ప్రాంతాన్ని గుర్తించారని వాదిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓటమి తర్వాత దక్షిణ చైనా సముద్రంలోని దీవుల మొత్తాన్ని ఒకే రేఖ కింద చూపుతూ దానిని చైనా పరిధిలోని నైన్‌డాష్‌లైన్‌గా అభివర్ణిస్తూ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇప్పటికీ అదే వాదన కొనసాగిస్తోంది. వందల సంఖ్యలో కృత్రిమ దీవులను చైనా ఇప్పటికే నిర్మించింది. మార్చి 7వ తేదీన ఫిలిప్పీన్స్‌కు చెందిన జూలియన్‌ ఫిలిప్పే ద్వీపం వద్దకు 220కి పైగా చైనా చేపల వేట ఓడలు తరలి వచ్చాయి. సైజులో చైనా చేపల వేట ఓడలు చిన్న సైజు యుద్ధనౌకలను తలపిస్తుంటాయి. వీటికి చైనా కోస్టుగార్డు మద్దతు ఉంది. ఇప్పటికీ వాటిల్లో చాలా నౌకలు అక్కడే ఉన్నాయి. దీనిపై ఫిలిప్పీన్స్‌ ఇప్పటి వరకు దాదాపు రెండువందల సార్లకుపైగా దౌత్య నిరసన తెలిపినా చైనాలో చలనం లేదు.

మారిటైమ్‌ లా పేరుతో మరో దుస్సాహసం..

చైనా మారిటైమ్‌ లా పేరిట సెప్టెంబర్‌ 1వ తేదీన మరో చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం చైనా ప్రాదేశిక జలాల్లో (సముద్రం మొదలైన 12 నాటికల్‌ మైళ్ల వరకు)కి ఏదైనా సైనిక, వాణిజ్య నౌకలు వస్తే వాటి పూర్తి సమాచారం వెల్లడించాలి. అణుశక్తి నౌక, రేడియోధార్మిక పదర్థాలను తీసుకెళ్లేవి, చమురు, రసాయనాల రవాణా, ద్రవరూప గ్యాస్‌, ఇతర విషపూరిత పదార్థాలను తరలించే నౌకలు ఆ సమాచారాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, నైన్‌డాష్‌ లైన్‌ పరిధిలోని చాలావరకు సముద్ర జలాలను తనదే అంటోంది. దీనికి అదనంగా చైనా అక్రమంగా నిర్మించిన కృత్రిమ దీవులకు ప్రాదేశిక జలాల పరిధి వర్తింపజేస్తోంది. ఇది అంతర్జాతీయ ఘర్షణలకు తావిస్తోంది. జపాన్‌, దక్షిణ కొరియా, ఆసియాన్‌ దేశాల వ్యాపారాలు దక్షిణ చైనా సముద్రం మీదుగానే జరుగుతున్నాయి. భారత వాణిజ్య నౌకల్లో 55శాతం ఇదే మార్గంలో ప్రయాణిస్తాయి.  చైనా మారిటైమ్‌ చట్టాన్ని, చైనా దళాలు అంతర్జాతీయ నౌకలపై దాడులు చేసే అధికారాలిచ్చిన కోస్ట్‌గార్డ్‌ చట్టాన్ని కలిపి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. దక్షిణ చైనా సముద్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవడానికే ఈ చట్టలు చేసింది. 

అసలు కొత్త చట్టంలో ఏముంది..?

చైనాకు మొత్తం 22,457 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దు ఉంది. మొత్తం 14 దేశాలతో ఇది సరిహద్దు పంచుకొంటోంది. దీనిలో భారత్‌తో 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ ఉంది. కొత్త ల్యాండ్‌ బోర్డర్‌ చట్టం ప్రకారం చైనా భౌగోళిక సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీలులేనిదని జిన్హూవా వార్త సంస్థ పేర్కొంది. సరిహద్దుల రక్షణకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలంది. అంతేకాదు.. వీటిని రక్షించేందుకు పోరాడవచ్చు. సరిహద్దుల రక్షణ, అక్కడి ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సరిహద్దుల్లో ప్రజా సేవలు, మౌలిక వసతులను మెరుగుపర్చడం, సరిహద్దుల రక్షణ వ్యవస్థలను అక్కడి సామాజిక, ఆర్థిక అభివృద్ధితో సమన్వయం పెంచేలా చైనా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది.

భారత్‌కు డెడ్‌లైన్‌ విధించి ఒత్తిడి..!

భారత్‌తో వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు వివాదంపై కోర్‌ కమాండర్ల స్థాయి సమావేశాలు జరుగుతున్న వేళ చైనా నేషనల్‌ కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీ ఈ చట్టాన్ని పాస్‌ చేసింది. దీనిపై అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ సంతకం చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న స్థానాల నుంచి చైనా కదిలేందుకు మరింత మొండికేయవచ్చు. నార్తన్‌ కమాండ్‌ మాజీ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు సరిహద్దు బాధ్యతలు పూర్తిగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి దఖలు పడ్డట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఈ ప్రభావంతో చర్చలు కూడా భారత్‌కు మరింత సవాలుగా మారే అవకాశం ఉంది. ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి1 నుంచి అమల్లోకి రానుండటంతో భారత్‌ సరిహద్దు వివాదాలను ఈలోగా పరిష్కరించుకోవాలని డెడ్‌లైన్‌ విధించడం ఓ రకంగా ఒత్తిడికి గురి చేసే ప్రయత్నమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని