Power Crisis In China: కరెంటు కష్టాలు తీర్చేందుకు చైనా కీలక నిర్ణయం!

దేశంలో విద్యుత్తు, బొగ్గు కొరతతో ఏర్పడిన తీవ్ర సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.............

Published : 08 Oct 2021 23:22 IST

ఉత్పత్తి పెంచాలని బొగ్గు గనులకు ఆదేశాలు!

బీజింగ్‌: దేశంలో విద్యుత్తు, బొగ్గు కొరతతో ఏర్పడిన తీవ్ర సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇక్కడి రెండు అతిపెద్ద బొగ్గు రీజియన్‌లు షాంజీ, ఇన్నర్‌ మంగోలియాలు.. వెంటనే తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు 160 మిలియన్ టన్నులకు పైగా పెంచాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. చైనాలో ఎక్కువ శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారితంగానే జరుగుతుంది. అయితే, 2060 నాటికి కర్బన రహిత దేశంగా మారాలన్న లక్ష్యం, ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి నిలిపివేయడం తదితర కారణాలతో కొన్నాళ్లుగా చైనాలో బొగ్గు కొరత ఏర్పడింది. దీంతో విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా కరెంటు కోతలతో జనజీవనం అస్తవ్యస్తం కావడంతోపాటు పారిశ్రామిక రంగం కుదేలవుతోన్న విషయం తెలిసిందే.

31 మిలియన్‌ టన్నుల భర్తీ..

బొగ్గు ఉత్పత్తిని పెంచే క్రమంలో షాంజీ రీజియన్‌లోని 98 బొగ్గు గనులు.. తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 55.3 మిలియన్ టన్నుల మేర పెంచాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఇక్కడి 51 బొగ్గు గనుల్లో బొగ్గు వెలికితీత ప్రక్రియను కొనసాగించాలని, వాటి సామర్థ్యాన్ని మరో ఎనిమిది మిలియన్ టన్నులకు పెంచాలని అధికారులు సూచించారు. ఇన్నర్ మంగోలియాలోని 72 గనుల్లో మరో 98.35 మిలియన్ టన్నులు పెంచాలని ప్రతిపాదించారు. దీంతోపాటు పదుల కొద్దీ గనులను తిరిగి తెరవడానికి, కొత్తవాటి ప్రారంభానికీ ఆమోదం తెలిపారు. మరోవైపు 2021లో చైనాలో థర్మల్ బొగ్గు కొరత 116 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తాజా నిర్ణయాలతో ఇందులో దాదాపు 31 మిలియన్ టన్నులు భర్తీ అవుతుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని