China: చైనాలోని మరో నగరంలో లాక్‌డౌన్‌.. ఆంక్షలతో జియాన్‌ ఉక్కిరిబిక్కిరి!

చైనాలో కరోనా పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి! 21 నెలల్లోనే ప్రస్తుతం అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతుండటంతో.. మళ్లీ ఆంక్షల్లోకి వెళ్తోంది. ఇప్పటికే 1.3 కోట్ల జనాభా ఉన్న జియాన్‌ నగరంలో కఠిన లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. తాజాగా యానాన్ నగరంలో...

Published : 28 Dec 2021 23:30 IST

బీజింగ్‌: చైనాలో కరోనా పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి! 21 నెలల్లోనే ప్రస్తుతం అత్యధిక రోజువారీ కేసులు నమోదవుతుండటంతో మళ్లీ ఆంక్షల్లోకి వెళ్తోంది. ఇప్పటికే 1.3 కోట్ల జనాభా ఉన్న జియాన్‌ నగరంలో కఠిన లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. తాజాగా యానాన్ నగరంలో లక్షలాది మందిని ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇతర దేశాలతో పోల్చితే స్థానికంగా తక్కువ కేసులే నమోదవుతున్నా.. చైనా తన ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా శనివారం 209 పాజిటివ్‌ కేసులు బయటపడగా.. 2200కు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

వుహాన్‌ స్థాయి కట్టడి చర్యలు..

జియాన్‌ నగరంలో వరుసగా ఆరో రోజు కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. డ్రైవింగ్‌పై నిషేధం, మూడు రోజులకోసారి మాత్రమే కిరాణా సామగ్రి తెచ్చుకునేందుకు అనుమతి.. అదీ ఇంటినుంచి ఒకరికి మాత్రమే బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించడం తదితర నిబంధనలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ‘ఒకవైపు ఇంట్లో ఆహార పదార్థాలు అయిపోయాయి. మరోవైపు నన్ను బయటకు రానివ్వడం లేదు. ఆకలితో చనిపోయే పరిస్థితి నెలకొంది. దయచేసి సహాయం చేయండి’ అంటూ ఓ స్థానికుడు ‘విబో’ వేదికగా వాపోవడం చైనాలో స్థానిక పరిస్థితులకు అద్దం పడుతోంది! మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో.. వుహాన్ నగరంలో ఇదే తరహాలో ఆంక్షలు అమలయ్యాయి. ఆ తర్వాత చైనాలో అత్యంత విస్తృత లాక్‌డౌన్‌ ఇదే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని