చైనా నగరాల్లో ఎమర్జెన్సీ..!

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిళ్లైన చైనాలో వైరస్‌ ఉద్ధృతి మరోసారి పెరిగింది. దీంతో మూడున్నర కోట్ల జనాభా కలిగిన ఓ ప్రావిన్సులో వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ ప్రకటించారు.

Published : 14 Jan 2021 01:19 IST

వైరస్‌ కట్టడికి చర్యలు చేపడుతోన్న ప్రావిన్సులు

బీజింగ్‌: కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో వైరస్‌ ఉద్ధృతి మరోసారి పెరిగింది. దీంతో మూడున్నర కోట్ల జనాభా కలిగిన ఓ ప్రావిన్సులో వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని చైనా అదుపు చేసినప్పటికీ.. గతకొన్ని వారాలుగా కేసుల సంఖ్య వందల్లో నమోదవుతోంది. దీంతో అక్కడి నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ ఆంక్షలు‌ అమలు చేస్తున్నారు.

గతకొన్ని వారాలుగా చైనాలోని హెబీ ప్రాంతంలో వైరస్‌ తీవ్రత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. తాజాగా 3.75కోట్ల జనాభా కలిగిన హైలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్సులోనూ వైరస్‌ తీవ్రత పెరగడంతో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని ఆదేశించారు. కాన్ఫరెన్సులను రద్దు చేయడంతో పాటు ప్రజలు సమూహాలుగా ఏర్పడటంపైనా ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతంలో తాజాగా 28పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

హైలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్సులో ఉన్న ప్రధాన నగరాల్లో సుహువా నగరం ఒకటి. ఇక్కడ ఒక కేసు నిర్ధారణ కాగా, మరో 45లక్షణాలు లేని కేసులను గుర్తించారు. దీంతో దాదాపు 52లక్షల జనాభా కలిగిన ఈ నగరాన్ని మూసివేశారు. వీటికి చుట్టుపక్కల చిన్న పట్టణాల నుంచి రాకపోకలను కూడా నిషేధించారు. అంతేకాకుండా ఆ ప్రావిన్సులోని అన్ని వేడుకలను రద్దుచేయాలని అధికారులు ఆదేశించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

చైనాకు నూతన సంవత్సర భయం..
చైనా ల్యూనార్‌ నూతన సంవత్సరాన్ని ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఈ సమయంలో కోట్ల మంది చైనీయులు కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. అంతేకాకుండా నగరాల్లో ఉండే ప్రజలు తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్తారు. ఈ సమయంలోనే పలు ప్రావిన్సుల్లో వైరస్‌ తీవ్రత పెరగడం చైనా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక దేశరాజధాని బీజింగ్‌కు సమీపంలో ఉన్న హెబీ ప్రావిన్సులోనూ నిన్న ఒక్కరోజే 115 కేసులు నమోదయినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. ఇప్పటికే అక్కడ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే, కరోనా వైరస్ మూలాలపై శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిపుణుల బృందం వుహాన్‌లో పర్యటిస్తుందని చైనా మంగళవారం వెల్లడించింది. జనవరి 14న సింగపూర్ నుంచి వైరస్‌ పుట్టిల్లుగా భావిస్తోన్న వుహాన్‌ నగరానికి చేరుకుంటుందని తెలిపింది. అయితే, అక్కడ డబ్ల్యూహెచ్‌ఓ బృందం ఎన్నిరోజులపాటు దర్యాప్తు కొనసాగిస్తుందన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.

ఇవీ చదవండి..
చైనాలో మరోసారి విస్తరిస్తోన్న మహమ్మారి!
కొవిడ్‌ మూలాలు..వుహాన్‌కు WHO బృందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని