Xinjiang: అమెరికా ఒత్తిడితో వెనక్కి తగ్గిన చైనా..!

వీఘర్‌ ముస్లింల అణచివేతపై అమెరికా చేస్తున్న ప్రయత్నాలు కొద్దిమేరకు ప్రభావం చూపుతున్నాయి. షింజియాంగ్‌ ప్రావిన్స్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీని మార్చింది.

Published : 26 Dec 2021 16:40 IST

 షింజియాంగ్‌ ప్రావిన్స్‌ పార్టీ సెక్రటరీ మార్పు

ఇంటర్నెట్‌డెస్క్‌: వీఘర్‌ ముస్లింల అణచివేతపై అమెరికా చేస్తున్న ప్రయత్నాలు కొద్దిమేరకు ప్రభావం చూపుతున్నాయి. షింజియాంగ్‌ ప్రావిన్స్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీని మార్చింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న చెన్‌ క్వాగ్యూ పక్కనపెట్టింది. ఆయన స్థానంలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ మా షింగ్రూయ్‌ను ఈ స్థానంలో నియమించింది. చెన్‌ను పదోన్నతితో మరో స్థానంలో నియమించే అవకాశం ఉన్నట్లు షిన్హూవా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. 

చెన్‌ క్వాగ్యూ 2016లో షింజియాంగ్‌ ప్రావిన్స్‌ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వీఘర్‌ ముస్లింల కోసం రీ ఎడ్యూకేషనల్ క్యాంపుల నిర్మాణాల నెట్‌వర్క్‌ను ఆయనే పర్యవేక్షించారు. ఈ నిర్మాణాల్లో 2017 నుంచి వీఘర్లను బంధించడం మొదలుపెట్టారు. తొలుత రీఎడ్యూకేషనల్‌ క్యాంపులు ఉన్న విషయాన్ని అంగీకరించేందుకు చైనా మొగ్గు చూపలేదు. కానీ, తర్వాత ఆ భవనాలను వొకేషనల్‌ ట్రైనింగ్‌ భవనాలుగా మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. 2020లో ట్రంప్‌ సర్కారు వీటిపై మండిపడింది. ముగ్గురు సీసీపీ సభ్యులు మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ప్రకటించింది. ఆ ముగ్గురిలో చెన్‌ కూడా ఉన్నారు. ఆయన్ను అమెరికాలోకి అడుగు పెట్టనీయకుండా నిషేధం విధించారు.

షింజియాంగ్‌ ప్రాంతం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై నిషేధం విధించింది. ఈ మేరకు తీసుకొచ్చిన ‘వీఘర్‌ ఫోర్స్‌డ్‌ లేబర్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌’ బిల్లుపై గత వారమే కాంగ్రెస్‌ ఆమోదం తెలపగా.. ఇటీవల దేశాధ్యక్షుడు జో బైడెన్‌ దానిపై సంతకం చేశారు. ఈ ప్రావిన్స్‌ నుంచే అమెరికాకు ఏటా 20 శాతం మేర వస్త్రాలు దిగుమతి అవుతుంటాయి. ఇప్పుడు వాటిపై అగ్రరాజ్యం నిషేధం విధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని