China: టిబెట్‌ వద్దరోబో సైన్యాన్ని మోహరించిన చైనా..!

చైనా సైన్యం శారీరకంగా అనుకున్నంత పటిష్ఠంగా లేదని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. తాజాగా ఇక్కడ సైనికులు వాతావరణానికి తట్టుకోలేకపోతుండటంతో రోబోలను బరిలోకి దించింది.

Updated : 31 Dec 2021 15:25 IST

 ఎల్‌ఏసీ వద్ద పెరుగుతున్న మోహరింపులు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా సైన్యం శారీరక దారుఢ్యంలో అనుకున్నంత పటిష్ఠంగా లేదని జరుగుతోన్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. తాజాగా ఇక్కడ సైనికులు వాతావరణానికి తట్టుకోలేకపోతుండటంతో రోబోలను బరిలోకి దించింది. ఈ విషయాన్ని పలు ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. డ్రోన్ల ద్వారా వేడివేడి ఆహారం పంపడం.. హీట్‌ ఛాంబర్ల చిత్రాలను ప్రచారం చేసుకోవడం ద్వారా తమ సైనికులు ఉన్న సౌకర్యాలను గొప్పగా చూపించుకొంది. కానీ, వాస్తవాలను పరిశీలిస్తే.. వారు అక్కడి శీతల పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు.

వాస్తవాధీన రేఖ వద్దకు చైనా మెషిన్‌ గన్‌ రోబోలను తరలించింది. అక్కడి అత్యంత ఎత్తైన పర్వత వాతావరణానికి చైనా సైనికులు తట్టుకోలేకపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ రోబోలు ఆయుధాలు ప్రయోగించడంతోపాటు.. సామగ్రిని కూడా తరలించగలవు.

 చైనా మోహరించిన వాహనాల్లో ‘ది షార్ప్‌ క్లా’ అనే సాయుధ వాహనం ఉంది. దీనిపై లైట్‌ మెషిన్‌గన్‌ను అమర్చారు. రిమోట్‌ ద్వారా ఈ వాహనాన్ని ఆపరేట్‌ చేయవచ్చు. ఇలాంటివి 88 వాహనాలను టిబెట్‌కు తరలించగా.. ఇప్పటికే 38 ఎల్‌ఏసీ వద్ద మోహరించింది. చైనా ఆయుధ తయారీ సంస్థ నోరిన్‌కో వీటిని అభివృద్ధి చేసింది.

‘ది ముల్‌-200’ పేరిట పిలిచే మరో మానవరహిత వాహనం కూడా టిబెట్‌కు చేరింది. సరకు రవాణా చేయడం దీని ప్రధాన విధి. అవసరమైతే దీనిపై ఆయుధాలను కూడా అమర్చవచ్చు. ఇలా మొత్తం 120 వాహనాలను తరలించింది. వీటిల్లో చాలా వరకూ వాస్తవాధీన రేఖ వద్దకు చేరుకొన్నాయి. ఈ వాహనాలకు అదనంగా 70 వీపీ-22 వాహనాలను, 150 ఎల్‌వైఎన్‌ఎక్స్‌ వాహనాలను కూడా పంపింది. ఎల్‌వైఎన్‌ఎక్స్‌ వాహనంపై శతఘ్నులు, భారీ మెషిన్‌ గన్‌లు, మోర్టార్లు, చిన్న క్షిపణి లాంఛర్లలను అమర్చవచ్చు.. బలగాలను తరలించవచ్చు. వీపీ-22 వాహనంలో 15 మంది సైనికులను తరలించవచ్చు. అవసరమైతే అంబులెన్స్‌కు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.

ఇప్పటికే టిబెట్‌లో ఉన్న కొందరు సైనికులకు సామర్థ్యాన్ని పెంచే ఎక్సోస్కెలిటన్‌ సూట్లను అందజేశారు. ఈ సూట్‌ హైఆల్టిట్యూడ్‌ యుద్ధ తంత్రంలో ఉపయోగపడుతుందని గ్లోబల్‌ టైమ్స్‌ గతంలో వెల్లడించింది.

అడుగడుగునా గండమే..

అతి శీతల పరిస్థితుల్లో పనిచేయడం సైనికులకు పలు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. అతిశీతల వాతావరణంలో లోహాలను చేతులతో పట్టుకుంటే గాయపడక తప్పని పరిస్థితి. దీంతో అక్యూట్‌ మౌంటేన్‌ సిక్‌నెస్‌, హైఆల్టిట్యూడ్‌ పల్మనరీ ఎడీమా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. చైనా సైనికులను పూర్తిస్థాయిలో చలి వాతావరణానికి అలవాటు పడనివ్వడంలేదు.  2,500 నుంచి 3,000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రదేశాల్లో అడుగుపెట్టే కొద్దీ గాలి ఒత్తిడి తగ్గి వాటిల్లో ఆక్సిజన్‌ 30శాతం వరకు పడిపోతుంది. ఫలితంగా తగినంత ప్రాణవాయువు అందదు. వేగంగా ఎత్తయిన  ప్రదేశాలకు వెళ్లేకొద్దీ శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. దీనిని తట్టుకోవడానికి హపోబ్యాగ్‌ను వాడుతుంటారు. అక్కడి వాతావారణానికి అలవాటు పడటం ఒక్కటే మార్గం. 3వేల మీటర్లు దాటాక కొన్నాళ్లు అక్కడే ఉండి వాతావరణానికి అలావాటు పడాలి. ఇక 4వేల మీటర్ల ఎత్తు దాటిన తర్వాత ప్రతి 300 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని