క్వాడ్‌ సదస్సు: కలవరపడుతోన్న చైనా..!

నాలుగు అగ్ర దేశాధినేతలు పాల్గొంటున్న ‘క్వాడ్‌’ సదస్సుపై చైనా కలవరపాటుకు గురవుతోంది. దేశాల మధ్య పరస్పర సహకారం కోసమే ప్రత్యేక కూటమి దృష్టిపెట్టాలి కానీ, ఇతరులను (థర్డ్‌పార్టీని) లక్ష్యంగా చేసుకోవడం కోసం కాదని హితవు పలికింది. 

Published : 12 Mar 2021 19:42 IST

‘థర్డ్‌పార్టీ’ని లక్ష్యంగా చేసుకోవద్దని హితవు

బీజింగ్‌: నాలుగు అగ్ర దేశాధినేతలు పాల్గొంటున్న ‘క్వాడ్‌’ సదస్సుపై చైనా కలవరపాటుకు గురవుతోంది. దేశాల మధ్య పరస్పర సహకారం కోసమే ప్రత్యేక కూటమి దృష్టిపెట్టాలి కానీ, ఇతరులను (థర్డ్‌పార్టీని) లక్ష్యంగా చేసుకోవడం కోసం కాదని హితవు పలికింది. ‘దేశాల మధ్య సహకారం, ఒప్పందాలు ఆయా దేశాల ప్రయోజనాలు, వారిమధ్య విశ్వాసం పెరిగేందుకు దోహదం చేయాలి. అంతేకానీ, థర్డ్‌పార్టీని లక్ష్యంగా చేసుకోవడం, ఇతరుల ప్రయోజనాలను దెబ్బతీయడం కోసం కాదు’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ పేర్కొన్నారు. పారదర్శకత, సమగ్రత, విన్‌-విన్‌ సూత్రాలకు అనుగుణంగా ఆయా దేశాలు నడుచుకుంటాయని, శాంతి, సుస్థిరత, ప్రాంతాల శ్రేయస్సు కోసం క్వాడ్‌ దేశాలు పనిచేస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు. శుక్రవారం జరుగుతోన్న క్వాడ్‌ సదస్సులో చైనాను ఎదుర్కొనే వ్యూహంపైనే చర్చ జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో చైనా ఈ విధంగా స్పందించింది.

భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగాలు పాల్గొనే క్వాడ్‌ సదస్సు వర్చువల్‌ పద్ధతిలో జరుగనుంది. దాదాపు 90నిమిషాల పాటు జరిగే ఈ సదస్సులో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటికే పట్టుబిగిస్తోన్న చైనాను ఎలా కట్టడి చేయడంపైనా క్వాడ్‌ దేశాధినేతలు దృష్టిసారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన క్వాడ్‌ సదుస్సుపై  స్పందించిన చైనా, ఇతరులను లక్ష్యంగా చేసుకొని ఈ భేటీ ఉండవద్దని, కూటమి దేశాల పరస్పర సహకారంపైనే దృష్టిసారించాలని పరోక్షంగా సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని