అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా

చైనా సైన్యం పరాసెల్‌ దీవుల వద్ద  తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధనౌకను పారద్రోలామని సోమవారం  ప్రకటించింది. అయితే దక్షిణ చైనా సముద్రం మీద చైనాకు హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు తీర్పు ఇచ్చి, సోమవారానికి సరిగ్గా ఐదేళ్లు గడచినవేళ ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 

Published : 12 Jul 2021 17:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరాసెల్స్‌ దీవుల వద్ద తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టినట్లు సోమవారం చైనా సైన్యం ప్రకటించింది. అయితే దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కూ లేదని అంతర్జాతీయ కోర్టు తీర్పు ఇచ్చి, సోమవారానికి సరిగ్గా ఐదేళ్లు గడచిన వేళ ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అమెరికాకు చెందిన బెన్‌ఫోల్డ్‌ యుద్ధనౌక పరాసెల్స్‌ వద్ద చైనా ప్రభుత్వం అనుమతి లేకుండా చొరబడిందని సైన్యం తెలిపింది. అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించడంతో పాటు, దక్షిణ చైనా సముద్రంలో తటస్థతకు భంగం కలిగించిందని, పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన దక్షిణ థియేటర్‌ కమాండ్‌ తెలియజేసింది. ‘అలాంటి రెచ్చగొట్టే చర్యలను తక్షణమే నిలుపుదల చేయాలని అమెరికాను కోరుతున్నాం’ అని  ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సంఘటనపై అమెరికా నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

న్యాయస్థానం తీర్పును పెడచెవిన పెట్టిన చైనా

పరాసెల్స్‌ దాదాపు వంద ద్వీపాల సముదాయం. కోరల్‌ దీవులు, సముద్ర సంపదకు నెలవు. వీటిపై చైనా, వియత్నాం, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేసియా, బ్రూనే దేశాలు చారిత్రకంగా తమకే హక్కు ఉందని చెప్పుకుంటున్నాయి. అయితే జులై 12, 2016లో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం చైనాకు దక్షిణ చైనా సముద్రంపై చారిత్రకంగా ఎలాంటి హక్కూ లేదని తీర్పునిచ్చింది. అంతేగాక, ఫిలిప్పీన్స్‌కు ఉన్న చేపలు పట్టే హక్కును ఉల్లంఘిస్తోందనీ, రెడ్‌ బ్యాంకు వద్ద చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం మైనింగ్‌ చేయడం ద్వారా ఆ దేశ సార్వభౌమత్వాన్ని చైనా ఖాతరు చేయడం లేదని చెప్పింది.

అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన!

ఇదిలా ఉండగా ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సముద్ర జలాల్లో స్వేచ్ఛకు సంబంధించి అన్నిదేశాలకు తమ శాశ్వత ప్రయోజనాలు ఉంటాయని, అయితే దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్నన్ని ఉల్లంఘనలు ఇంకెక్కడా చోటు చేసుకోవడం లేదని ఓ ప్రకటనలో తెలిపారు. చైనా ఇతర ఆగ్నేయ ఆసియా దేశాలమీద పెత్తనం చెలాయిస్తూ, సముద్రయానానికి సంబంధించిన విధివిధానాలకు భంగం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని