china: తవాంగ్‌ ఘర్షణపై స్పందించిన చైనా..!

తవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌ సైనికులతో జరిగిన ఘర్షణపై చైనా స్పందించింది. అన్ని ఒప్పందాలను భారత్‌ అమలు చేయాలని కోరింది.

Updated : 13 Dec 2022 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో డిసెంబర్‌ 9న భారత్‌ దళాలతో జరిగిన ఘర్షణపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మాట్లాడుతూ ‘‘నాకు తెలిసినంత వరకు భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా ఉంది. ఇరు పక్షాలు దౌత్య, సైనిక మార్గాల్లో నిరంతరాయంగా చర్చలను కొనసాగిస్తున్నాయి. చైనా, భారత్‌లు ఈ దిశగా ముందడుగు వేస్తాయని ఆశిస్తున్నా’’ అని వెల్లడించారు. ఏకాభిప్రాయాలకు వచ్చిన అంశాలను ఇరుపక్షాలు పాటించాలని.. ఒప్పందాలను కఠినంగా అమలు చేయాలని చైనా కోరింది. భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణపై స్పందించాలని ఆదేశ రక్షణశాఖను ఓ ఆంగ్ల వార్తా సంస్థ కోరగా.. ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

మరోవైపు ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలను భారత కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌ ఉభయసభలకు వెల్లడించింది. ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో మాట్లాడారు. సరిహద్దుల వద్ద యథాతథ పరిస్థితిని చైనా ఏకపక్షంగా మార్చాలని చూసిందని.. ఈ చర్యలను భారత సైనికులు అడ్డుకొన్నారని పేర్కొన్నారు. ఇరుపక్షాల సైనికులకు గాయాలయ్యాయని..  భారత సైన్యంలో ఎవరూ చనిపోలేదన్నారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో రెండు దేశాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు. తవాంగ్‌ సెక్టార్‌లోని యాంగ్‌త్సె ప్రాంతం వద్ద ఈ నెల 9న చోటుచేసుకున్న ఈ ఘర్షణ తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భారతీయులతో పోలిస్తే చైనా సైనికులు చాలా ఎక్కువ మంది ఈ ఘర్షణలో గాయపడినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని