India-China talks: నేడేభారత్‌-చైనా 14వ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు..

తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ విషయమై బుధవారం భారత్‌- చైనాల మధ్య 14వ కోర్‌ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం నిర్వహణను చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌...

Updated : 12 Jan 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన సమస్యాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ విషయమై బుధవారం భారత్‌- చైనాల మధ్య 14వ కోర్‌ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం వివరాలను చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మంగళవారం ధ్రువీకరించారు. ప్రస్తుతం భారత్‌తో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు. ఈ విడత చైనాతో నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు భారత ఉన్నతాధికారులు తెలిపిన మరుసటి రోజే వెన్‌బిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా భూభాగంలో ఉన్న మోల్డో ప్రాంతంలో ఈ సమావేశం ఉంటుందని చెప్పారు. ‘ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అంతా ప్రశాంతంగా ఉంది. దౌత్య, సైనిక మార్గాల ద్వారా ఇరుపక్షాలు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాయి’ అని వెల్లడించారు.

ఈ క్రమంలోనే సరిహద్దుల్లో పరిస్థితులను ఎమర్జెన్సీ మోడ్ నుంచి సాధారణానికి తీసుకురావడంలో భారత్‌ సహకరించగలదని ఆశిస్తున్నట్లు వెన్‌బిన్‌ తెలిపారు. మరోవైపు.. రేపటి చర్చల్లో భారత్‌ ప్రధానంగా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సైన్యాల ఉపసంహరణపై చర్చించనున్నట్లు సమాచారం. తూర్పు లద్దాఖ్‌లో 2020 మే నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, ఎల్‌ఏసీ వెంబడి భారీగా సైన్యాలను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటికే 13 సార్లు చర్చలు జరిగాయి. వీటి ఫలితంగా పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, గోగ్రా నుంచి ఇరు పక్షాల సైన్యాలు వెనక్కి వెళ్లాయి. కానీ, డ్రాగన్‌ మొండి వైఖరి కారణంగా గతేడాది అక్టోబర్‌లో జరిగిన 13వ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని