China: అరుణాచల్‌ప్రదేశ్‌లో జీ-20 సమావేశం.. చైనా డుమ్మా..!

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో భాగం కాదని పదేపదే వాదిస్తున్న పొరుగు దేశం చైనా (China).. ఇప్పుడు ఆ రాష్ట్రంలో న్యూదిల్లీ నిర్వహించిన కీలక జీ-20 సమావేశానికి గైర్హాజరైంది.

Published : 27 Mar 2023 10:49 IST

దిల్లీ: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌ (Arunachal Pradesh) వేదికగా శని, ఆదివారాల్లో జీ-20 రహస్య సమావేశం (G20 meeting) జరిగింది. అయితే ఈ సమావేశానికి చైనా (China) దూరంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి చైనా ప్రతినిధులు హాజరుకాలేదని అరుణాచల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

అరుణాచల్‌ (Arunachal Pradesh) రాజధాని ఈటానగర్‌లో శని, ఆదివారాల్లో ఈ సమావేశం (G20 meeting) జరిగింది. ఇందులో భారత అధికారులతో పాటు జీ-20 దేశాలకు చెందిన దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే, చైనా (China) నుంచి ఒక్క ప్రతినిధి కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదని సదరు అధికారి పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియా కవరేజ్‌కు కూడా అనుమతినివ్వలేదు. అయితే, సమావేశం తర్వాత ఆ ఫొటోలను అరుణాచల్‌ ప్రభుత్వ మీడియా ప్రతినిధి ట్విటర్‌లో షేర్‌ చేశారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో భాగమని చైనా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే డ్రాగన్‌ వ్యాఖ్యలను భారత్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అరుణాచల్‌ తమ అంతర్భాగమేనని చైనాకు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అరుణాచల్‌లో జరిగిన జీ-20 సమావేశాలకు (G20 meeting) చైనా దూరంగా ఉండటం చర్చనీయాశంగా మారింది. అయితే దీనిపై ఇటు భారత విదేశాంగ శాఖ గానీ.. అటు చైనా గానీ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. అంతేగాక, ఈ సమావేశంపై చైనా (China) అధికారికంగా అభ్యంతరాలు లేవనెత్తిందా లేదా అనేదానిపై కూడా స్పష్టత లేదు.

జీ-20 బృందానికి ఈ ఏడాది భారత్‌ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరులో దిల్లీ వేదికగా జీ-20 (G20)దేశాధినేతల ప్రధాన సదస్సు జరగనుంది. ఆ భేటీకి ముందు దేశవ్యాప్తంగా 50 ప్రధాన నగరాల్లో పలు రంగాలు, అంశాలపై జీ-20 సమావేశాలు (G20 meeting) జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ‘రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ ఇనిషియేటివ్‌’ అనే అంశంపై ఈటానగర్‌లో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని