చైనా టీకా: పంపిణీ తక్కువ..ఎగుమతి ఎక్కువ!

చైనాలో పంపిణీ చేస్తోన్న వ్యాక్సిన్‌ల కంటే ఇతర దేశాలకే ఎక్కువ డోసులను ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 16 Feb 2021 01:34 IST

బీజింగ్‌: కరోనా వైరస్‌కు మూలకారణమైన చైనా, వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీలోనూ విభిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో పంపిణీ చేస్తోన్న వ్యాక్సిన్‌ల కంటే ఇతర దేశాలకే ఎక్కువ డోసులను ఎగుమతి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ నాలుగు కోట్ల డోసులను పంపిణీ చేయగా, నాలుగున్నర కోట్ల డోసులను ఎగుమతి చేసినట్లు వెల్లడైంది.

కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాలో, అన్ని దేశాలకంటే ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తుదిదశ ప్రయోగాలు పూర్తికాకముందే, అత్యవసర వినియోగం కింద భారీ స్థాయిలో పంపిణీ చేసిన డ్రాగన్‌ దేశం, ఇప్పటివరకు 4కోట్ల డోసులను పంపిణీ చేసింది. ఇది అమెరికా కన్నా తక్కువే కావడం విశేషం. అయితే, అంతకన్న ఎక్కువ (4.6కోట్ల) డోసులను విదేశాలకు పంపిణీ చేసినట్లు హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా ఉన్న సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాకుండా లక్షల సంఖ్యలో మరిన్ని డోసులను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్లేషించింది. ప్రస్తుతం చైనాలో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతోన్న కారణంగా ఫిబ్రవరి 11 నుంచి 18వరకు వ్యాక్సిన్‌ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

వ్యాక్సిన్‌పై అనుమానాలు..

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోన్న వ్యాక్సిన్‌ల ప్రయోగ దశల వివరాలు, వాటి సమర్థతపై ఎప్పటికప్పుడు నివేదికలు వెల్లడిస్తూనే ఉన్నాయి. కానీ, చైనా తయారుచేసిన వ్యాక్సిన్‌ల పనితీరుపై మాత్రం మొన్నటివరకూ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. దీంతో వ్యాక్సిన్‌ పనితీరు, సామర్థ్యంపై అక్కడి ప్రజల్లోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చైనా తయారు చేసిన సినోవాక్‌ వాక్సిన్‌ కేవలం 50శాతం సమర్థత ఉన్నట్లు తేలగా, సినోఫార్మ్‌ అభివృద్ధి చేసిన టీకా మాత్రం 79శాతం పనితీరు కనబరిచినట్లు ఈ మధ్యే వెల్లడైంది. అయితే, ఇది ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకాల సామర్థ్యం (90శాతం) కన్నా తక్కువే.

భారత్‌తో పోటీ..

వ్యాక్సిన్‌ తయారీకి కేంద్రంగా ఉన్న భారత్‌ ఇప్పటికే వివిధ దేశాలకు ఎగుమతి చేయడంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే పొరుగు దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌, మారిషస్‌ వంటి దేశాలకు ఉచితంగానే వ్యాక్సిన్‌ డోసులను అందించింది. వీటితోపాటు సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, మొరాకో దేశాలకు వాణిజ్య పరంగా వ్యాక్సిన్‌ ఎగుమతి చేస్తోంది. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ కీర్తిని సంపాదిస్తుందనే ఆందోళనలో ఉన్న చైనా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా, ప్రపంచ ఆరోగ్యసంస్థ నేతృత్వంలోని కొవాక్స్‌కు కోటి వ్యాక్సిన్‌ డోసులను అందజేస్తామని ఈ మధ్యే ప్రకటించింది. అంతేకాకుండా, శ్రీలంక, నేపాల్‌, బ్రెజిల్‌ వంటి మొత్తం 46దేశాలకు వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రకటించింది.

కరోనా వైరస్‌ కట్టడిలో విజయం సాధించిన చైనా, వ్యాక్సిన్‌ పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ (వ్యాక్సిన్‌ ద్వారా) సాధించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చైనాకు ఆ పరిస్థితి ఇబ్బందికరంగానే మారుతుందని అంతర్జాతీయ ఆరోగ్య రంగం నిపుణుడు హువాంగ్ యాన్‌జోంగ్‌ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ఎగుమతి వల్ల అంతర్జాతీయ స్థాయిలో చైనా పేరును సంపాదించుకోవచ్చేమో కానీ, ఇందుకోసం తాజా విధానం అంతగా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని