చైనాలో ఇకపై రాసేందుకు వార్తలుండవట..

చైనాలో ఇకపై వార్తలకు సెన్సార్‌ కష్టాలు తప్పవని పరిశీలకులు అంటున్నారు.

Published : 17 Feb 2021 14:41 IST

ఆన్‌లైన్‌ సమాచారంపై సెన్సార్‌ వేటు

తైపీ: సమాచార, ప్రసారాలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన చైనా, తాజాగా ఆన్‌లైన్‌ సమాచార నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు ఆ ప్రభుత్వం జారీ చేసిన నూతన నిబంధనలు వచ్చే వారం నుంచి అమలులోకి రానున్నాయి. దీనిని అనుసరించి.. ఇక్కడి బ్లాగర్లు తదితరులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు, విశ్లేషణలను ఆన్‌లైన్లో ప్రచురించే ముందు ప్రభుత్వ అనుమతిని పొందాలని సైబర్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ చైనా స్పష్టం చేసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రాధాన్యమిస్తున్న ‘‘డిజిటల్‌ సార్వభౌమాధికారం’’ భావనకు అనుగుణంగా తాజా ఆదేశాలు వెలువడ్డాయి.

ప్రైవేటుకు అవకాశం ఉండదా..

చైనాలో రాజకీయ, సైనిక, ప్రభుత్వ అంశాల ప్రచురణకు 2017 నుంచీ అనుమతి తప్పనిసరి. కాగా, ఇప్పుడు ఈ జాబితాలోకి ఆరోగ్య, ఆర్థిక, విద్యా, న్యాయ పరమైన అంశాలను కూడా చేర్చారు. సమాచార, ప్రసార వ్యవస్థలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే డ్రాగన్‌ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని సామాజిక మాధ్యమ నిపుణులు అంటున్నారు. దీనితో అధికార మీడియా, ఖాతాలకు తప్ప.. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఇకపై సమాచారాన్ని ప్రచురించే వీలుండకపోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

ఆన్‌లైన్‌ సమాచారంపై సెన్సార్‌

జాక్‌ మా వంటి ప్రముఖులకే ఇక్కడి కమ్యూనిస్టు పాలనను గురించి ప్రశ్నించే అవకాశం లేదు. ఇక తాజా నిబంధనల ప్రకారం ప్రభుత్వ, అధికారిక సమాచారంపై వ్యాఖ్యానాలు చేయవచ్చు కానీ.. వాటిని ప్రచురించేందుకు, షేర్‌ చేసేందుకు వీలుకాదని.. ఇక్కడి ప్రముఖ సామాజిక మాధ్యమం వైబో సీఈఓ వాంగ్‌ గావోఫెయి వివరించారు. ప్రభుత్వం అభద్రతా భావానికి లోనై ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని.. ఇకపై వార్తలకు సెన్సార్‌ కష్టాలు తప్పవని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు వినోదం, ఆహారం తప్ప రాసేందుకు వార్తలేవీ ఉండవని ఇక్కడి బ్లాగర్లు, మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ నిబంధనలు మీరిన వారికి శిక్షలు ఎలా ఉంటాయో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. కాగా ఇక్కడుండే సోహు, బైదు, వైబో వంటి ప్రముఖ ఆన్‌లైన్‌ మీడియా సంస్థలు ఈ విషయమై స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని