Published : 30 Apr 2022 02:18 IST

China: ఆ భారత విద్యార్థులు తిరిగి చైనా రావొచ్చు.. అనుమతి ఇస్తామన్న డ్రాగన్‌ సర్కారు

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి కారణంగా చైనా నుంచి అనేక మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగొచ్చారు. అప్పటి నుంచి వీసా, ఇతర ఆంక్షల కారణంగా వారంతా భారత్‌లోనే ఉండిపోయారు. అయితే వారంతా తిరిగి చైనాకు వచ్చి చదువులు కొనసాగించేందుకు వీలుగా డ్రాగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారు తిరిగొచ్చేందుకు వీలుగా ప్రక్రియ మొదలుపెట్టినట్లు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది.

‘‘చదువులు కొనసాగించేందుకు చైనా తిరిగి రావాలనుకునే భారత విద్యార్థులకు మేం అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, చైనా తిరిగొచ్చిన ఇతర దేశాల విద్యార్థుల అనుభవాలను మేం భారత అధికారులకు తెలియజేశాం. భారత విద్యార్థులు తిరిగొచ్చేందుకు వీలైన ప్రక్రియను ప్రారంభించాం. మా దేశానికి తిరిగి రావాలనుకునే విద్యార్థుల జాబితాను అధికారులు అందించాల్సి ఉంది’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ వెల్లడించారు.

అంతర్జాతీయంగా ఉన్న కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విదేశీ విద్యార్థుల రాకపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జావో ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై భారత్‌లోని చైనా ఎంబసీ పనిచేస్తోందని అన్నారు. చైనా ప్రకటన నేపథ్యంలో బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. చైనాకు తిరిగి వెళ్లాలనుకునే విద్యార్థుల వివరాలను సేకరించే పనిలో ఉంది. మే 8వ తేదీలోగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ జాబితాను డ్రాగన్‌ సర్కారుకు అందించిన తర్వాత.. ఎవరెవరు చైనా వచ్చి తమ కోర్సులు పూర్తి చేయాలో బీజింగ్ నిర్ణయించనుందని భారత ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక, అనుమతులు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్‌ విధివిధానాలను పాటించాలని, అందుకు సంబంధించిన ఖర్చులను కూడా సొంతంగా భరించాలని చైనా స్పష్టం చేసినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.

2019 డిసెంబరులో కరోనా వెలుగు చూసిన తర్వాత చైనా కఠిన ఆంక్షలు విధించింది. విదేశీ ప్రయాణాలు నిలిపివేసింది. దీంతో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి అక్కడ చిక్కుకున్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. చైనాలో చదువుకునేందుకు వెళ్లిన దాదాపు 23వేలకు పైగా విద్యార్థులు తిరిగి భారత్‌కు చేరుకున్నారు. వీరిలో చాలా మంది మెడిసిన్‌ విద్యార్థులే. అయితే వైరస్‌ ఉద్ధృతి తగ్గిన తర్వాత వీరు తమ చదువులు కొనసాగించేందుకు తిరిగి చైనా వెళ్లాలనుకున్నా.. బీజింగ్‌ ఆంక్షల కారణంగా అది వీలుపడలేదు. వీసాలు నిలిపివేయడం, విమానాలు రద్దు చేయడంతో వారంతా భారత్‌లోనే ఉండాల్సి వచ్చింది.

ఇటీవల పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక లాంటి కొన్ని దేశాల నుంచి విద్యార్థులు తిరిగి చైనా వచ్చేందుకు చైనా ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే భారత విద్యార్థులు, చైనాలో పనిచేసే భారత కుటుంబాలపై మాత్రం మౌనంగా ఉంటూ వచ్చింది. తాజాగా కొంతమంది భారత విద్యార్థులు తిరిగొచ్చేందుకు అనుమతులు కల్పిస్తామని చెబుతూ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా చైనాలో మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా షాంఘైలో రోజుకు పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్‌ కట్టడిలో భాగంగా డ్రాగన్ కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. బీజింగ్‌లో పాఠశాలలను మూసివేసింది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని