Updated : 27 Jun 2022 11:41 IST

LAC: భారత సరిహద్దుల్లో బలపడిన డ్రాగన్‌ రెక్కలు..!

 అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు, భారీ రన్‌వేలు సిద్ధం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్‌ సెక్టార్‌లో ఎల్‌ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్‌వేల అభివృద్ధి చేపట్టింది. వీటితోపాటు ఫైటర్‌ జెట్‌లను భద్రపర్చేందుకు బ్లాస్ట్‌ప్రూఫ్‌ బంకర్ల నిర్మాణం కూడా చేపట్టింది. భారత్‌తో వివాదం మొదలైన రెండేళ్లలోనే వీటిని సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనావేశాయి. ఈ విషయాన్ని కేంద్రంలోని కీలక అధికారులు ఓ ఆంగ్లపత్రికకు వివరించారు. ఇటీవల అమెరికా ఆర్మీ పసిఫిక్‌ కమాండ్‌ జనరల్‌ చార్లెస్‌ ఫ్లయాన్‌ కూడా భారత్‌ పర్యటన సమయంలో చైనా మోహరింపులపై ఆందోళన వ్యక్తం చేశారు.

1,20,000 సైనికుల కోసం నిర్మాణాలు..!

 2020లో భారత్‌-చైనా  ఘర్షణకు ముందు వాస్తవాధీన రేఖ వెంట పశ్చిమ సెక్టార్‌లో కేవలం 20,000 పీఎల్‌ఏ దళాలు మాత్రమే ఉండేలా నిర్మాణాలు ఉన్నాయి. కానీ, ఈ రెండేళ్లలో 1.2లక్షల మంది ఉండేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. దీంతోపాటు సౌరశక్తి, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టులను పీఎల్‌ఏ దళాలు నిర్మించాయి. ముఖ్యంగా శీతాకాలంలో కూడా దళాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా  ఉండేందుకు ఈ నిర్మాణాలను ఏర్పాటు చేశారు.

కంబైన్డ్‌ ఆర్మ్స్‌ బ్రిగేడ్‌లుగా మార్పు..!

వాస్తవాధీన రేఖ పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన షింజియాంగ్‌ డివిజన్‌ కిందకు వస్తుంది. ఇక్కడ మోహరించిన డివిజన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడంతోపాటు రొటేట్‌ చేస్తున్నారు. 2020లో వివాదం మొదలైన సమయంలో ఇక్కడ 4వ, 6వ డివిజన్లను మోహరించారు. 2021లో వాటిని మార్చేసి 8వ, 11వ డివిజన్లను ఇక్కడికి తరలించారు. ఈ ఏడాది 4వ, 8వ డివిజన్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మొత్తం డివిజన్లను కంబైన్డ్‌ ఆర్మ్స్‌ బ్రిగేడ్‌లుగా మార్చే పని కూడా వేగంగా జరుగుతోంది. వీటి పరికరాలను ఈ రెండేళ్లలో పూర్తిగా మార్చేశారు.

దళాల చేతికి అత్యాధునిక ఆయుధాలు..!

ఇక్కడ దళాలు వాడే ఆయుధాలను చైనా పూర్తిగా మార్చేసి.. కొత్తవి ఇచ్చింది. గతంలో ఇక్కడ 4వ డివిజన్‌ జెడ్‌టీజెడ్‌-88 తొలి తరం ట్యాంకును వినియోగించేది. కానీ, ఇప్పుడు జెడ్‌టీక్యూ(టైప్‌-15) మూడో తరం ఆధునిక ట్యాంకులను తరలించారు.  ఇక 6వ డివిజన్‌ గతంలో టైప్‌ 96ఏ రెండోతరం ట్యాంకులను వినియోగించేది. తాజాగా ఆ ట్యాంకుల ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థలను చైనా పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేసింది.

*ఇక్కడి మెకనైజ్డ్‌ బ్రిగేడ్‌లో దళాలను తరలించేందుకు గతంలో జెబీఎల్‌-08 వాహనాలను వాడేవారు. ఇప్పుడు వాటిని మార్చి జెడ్‌టీఎల్‌-11 వాహనాలను వినియోగిస్తున్నారు. ఇక 11వ డివిజన్‌లో సీఎస్‌కే సిరీస్‌ సాయుధ వాహనాలు వినియోగిస్తున్నారు. ఇవి అమెరికన్ల హమ్‌వీలను పోలి ఉంటాయి.

* అదే విధంగా వాస్తవాధీన రేఖ సమీపంలోని వైమానిక స్థావరాల్లో పేలుళ్లను తట్టుకొనేలా  బ్లాస్ట్‌పెన్‌లను నిర్మించారు. షిగాడ్స్‌,రూడక్‌ స్థావరాల్లో  హెలిపోర్టులు, గర్గున్స్‌, లాసా,గ్వాంగ్‌ఝూ స్థావరాల్లో రన్‌వేలను కూడా అభివృద్ధి చేశారు.

ట్రక్‌ మౌంటెడ్‌ శతఘ్నులు..!

చైనా సుదీర్ఘ శ్రేణి శతఘ్నులను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. గతంలో ఉన్న టోడ్‌ శతఘ్నులను తొలగించింది. ట్రక్కులపై అమర్చిన శతఘ్నులను అక్కడికి చేర్చింది. ఇవి 50 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. దాడి చేసిన వెంటనే శత్రువు గుర్తించే లోపు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌వేపు కూడా వాస్తవాధీన రేఖకు 50 కిలోమీటర్ల లోపు భారీగా శతఘ్నులను మోహరించారు.

* 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే పీహెచ్‌ఎల్‌-3 మల్టీ రాకెట్‌ లాంఛ్‌ వ్యవస్థలను వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చింది. వీటిని రష్యాకు చెందిన స్మెర్చి ఎంఆర్‌ఎల్‌ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇటువంటివి భారత్‌ వద్ద మూడు రెజిమెంట్లు ఉన్నాయి.

* సరిహద్దుల సమీపంలో హెచ్‌క్యూ-17 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను అమర్చింది. దీంతోపాటు చిప్‌చాప్‌ రిడ్జ్‌ వద్ద అత్యాధునిక హెచ్‌క్యూ-9 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను మోహరించింది. రష్యాకు చెందిన ఎస్‌-300 వలే ఇది పనిచేస్తుంది. 

* హోటన్‌లో చైనా ప్రస్తుతం 25 ఫైటర్‌ జెట్లను మోహరించింది. సాధారణ స్థితి కంటే ఇది చాలా ఎక్కువ.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని