China Vaccines: టీకాల సామర్థ్యంపై తొలిసారి నివేదిక!

కరోనా వైరస్‌ను నిరోధించడంలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రయోగ ఫలితాలు ప్రఖ్యాత అమెరికా మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా వైరస్‌తో పాటు వ్యాక్సిన్ల పనితీరుపై గోప్యత పాటిస్తోన్న చైనా.. తొలిసారి వ్యాక్సిన్‌ ప్రయోగాల ఫలితాలను అంతర్జాతీయ జర్నల్‌కు నివేదించింది

Published : 28 May 2021 18:40 IST

అమెరికా జర్నల్‌లో ప్రయోగ ఫలితాలు

బీజింగ్‌: కరోనా వైరస్‌ను నిరోధించడంలో చైనా తయారుచేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రయోగ ఫలితాలు ప్రఖ్యాత అమెరికా మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కరోనా వైరస్‌తో పాటు వ్యాక్సిన్ల పనితీరుపై గోప్యత పాటిస్తోన్న చైనా.. తొలిసారి వ్యాక్సిన్‌ ప్రయోగాల ఫలితాలను అంతర్జాతీయ జర్నల్‌కు నివేదించింది. తమదేశ వ్యాక్సిన్ల పనితీరుపై అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రయోగ ఫలితాలను చైనా విడుదల చేసినట్లు సమాచారం.

చైనా నేషనల్‌ బయోటెక్‌ గ్రూపునకు చెందిన సినోఫార్మ్‌తో పాటు సినోవాక్‌ బయోటెక్‌ సంస్థలు కరోనాను నిరోధించే రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. వైరస్‌ను ఎదుర్కోవడంలో వాటిలో ఒకటి 72.8శాతం, మరొకటి 78.1శాతం సామర్థ్యం చూపించినట్లు చైనా వెల్లడించింది. వీటికి సంబంధించిన నివేదికలు ‘జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ (JAMA)లో ప్రచురితమయ్యాయి. అయితే వ్యాక్సిన్ల సామర్థ్యంపై ఫిబ్రవరిలోనే ఆయా సంస్థలు ప్రకటన చేసినప్పటికీ ప్రయోగ నివేదికలను మాత్రం ఇప్పుడే బహిర్గతం చేశాయి.

తీవ్ర ఇన్‌ఫెక్షన్లు లేవు..

అమెరికా జర్నల్‌ నివేదిక ప్రకారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, ఈజిప్టు, జోర్డాన్‌ దేశాల్లో 40,832మందిపై రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు జరిపారు. మూడు వారాల గడువులో రెండు డోసులను ఇచ్చి పరీక్షించారు. వీటిలో వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ఎవ్వరికీ  ఇన్‌ఫెక్షన్‌ కారణంగా తీవ్ర లక్షణాలు కనిపించకపోగా.. ప్లాసిబో తీసుకున్న ఇద్దరిలో వైరస్‌ లక్షణాలు కనుగొన్నారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ వ్యాక్సిన్‌ సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. మహిళల్లో టీకాల సామర్థ్యం కాస్త తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ వీటిలో సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మధ్యే ఆమోదం తెలుపగా, మరో వ్యాక్సిన్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలను మార్చిలోనే అమెరికా జర్నల్‌కు అందజేయగా, వీటిని ప్రచురించేందుకు మే 12న అంగీకరించినట్లు చైనా సంస్థ సినోఫార్మ్‌ వెల్లడించింది.

ఆది నుంచి అనుమానాలే..

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోన్న సంస్థలు వివిధ దశల్లో వాటి ప్రయోగ ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాయి. కానీ, ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారి గురించి చైనా మొదటి నుంచి గోప్యత పాటిస్తోంది. హంగేరీ, సెర్బియా, సీషెల్స్‌, పెరూ, చిలీ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసినప్పటికీ, వాటి సమర్థత గురించిన ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. ఇదే సమయంలో వందశాతం వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన సీషెల్స్‌లో మళ్లీ వైరస్‌ ఉద్ధృతి కావడంతో టీకా పనితీరుపై అనుమానాలు బయలుదేరాయి. వ్యాక్సిన్లపై పారదర్శకంగా ఉండకపోవడంతో టీకాల పనితీరుపై పలు దేశాల నుంచి చైనా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అంతేకాక, చైనా వ్యాక్సిన్లకు ఆయా దేశాల్లోని నియంత్రణ సంస్థలు కూడా అనుమతుల ప్రక్రియను నిలిపివేశాయి. హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌లోనూ ఇదేవిధమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ల సామర్థ్యంపై పూర్తి ఫలితాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.

ఇదిలాఉంటే చైనా తయారు చేసిన రెండు వ్యాక్సిన్లలో సినోఫార్మ్‌ అనుమతి పొందగా.. సినోవాక్‌ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 కోట్ల డోసులను చైనా సరఫరా చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని