
India - China : అరుణాచల్‌లో చైనా గ్రామం.. భారత సైన్యం క్లారిటీ
దిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓ గ్రామం నిర్మించింది అంటూ అమెరికా ఇటీవల ఓ నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే.సైనిక సామర్థ్యం పెంచుకోవటం, ఇతర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదికలో తెలిపింది. తాజాగా దీనిపై భారత సైనిక వర్గాలు స్పందించాయి. ఆ గ్రామం చైనా నియంత్రణ ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి ఉన్న ఆ గ్రామం, ఆరు దశాబ్దాలుగా చైనా నియంత్రణలో ఉన్న ప్రాంతంలోనే ఉందని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
‘‘1959లో అసోం రైఫల్స్ పోస్ట్‌ను ఆక్రమించుకున్న పీఎల్ఏ అక్కడ తన సైనిక దళాలను మోహరించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం చైనా అధీనంలోనే ఉంది. ఆ తర్వాత అనేక నిర్మాణాలు చేపట్టింది’’
- భారత సైనిక వర్గాలు
భారత్ - చైనా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో చైనా వంద ఇళ్లు నిర్మించినట్లు కొద్ది రోజుల క్రితం అమెరికా రక్షణ శాఖ తమ పార్లమెంటుకు ఓ నివేదిక సమర్పించింది. మెక్ మోహన్ రేఖకు దక్షిణాన భారత సరిహద్దుల్లో ఈ గ్రామం ఉన్నట్లు అందులో పేర్కొంది. టిబెట్ అటానమస్ రీజియన్, భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఈ గ్రామాన్ని చైనా 2020 మధ్యలో నిర్మించి ఉంటుందని అమెరికా రక్షణ శాఖ నివేదికలో రాసుకొచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత భూ భాగం పరిధిలో డ్రాగన్ ఓ గ్రామం నిర్మించింది అంటూ.. ఉపగ్రహ ఛాయాచిత్రం ఆధారంగా ఓ ఇంగ్లిష్ టీవీ ఛానెల్ ఈ ఏడాది ఆరంభంలో ఓ వార్తా కథనం ప్రసారం కూడా చేసిన విషయం తెలిసిందే.
గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణను సైతం అమెరికా రక్షణ శాఖ ఆ నివేదికలో ప్రస్తావించింది. నలుగురు పీఎల్ఏ సైనికులకు చైనా అవార్డులు ప్రకటించినట్లు కూడా పేర్కొంది. అయితే చైనా వైపు ఎంతమంది చనిపోయారన్నదానిపై స్పష్టత లేదని తెలిపింది. భారత్ వైఖరి వల్లే తాము ఎల్‌ఏసీ వెంట సైనిక మోహరింపులు చేపట్టినట్లు చైనా అంటోందని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు నిలిపివేయటం సహా భారత్ తన సైన్యాన్ని ఉపసంహరించుకునే వరకు తాము వెనక్కి వెళ్లేదిలేదని చైనా పేర్కొన్నట్లు నివేదికలో అమెరికా రక్షణ శాఖ తెలిపింది.