
Xi Jinping: చైనాకు జీవితకాల ‘కింగ్’.. జిన్‌పింగ్
చరిత్రాత్మక తీర్మానానికి కమ్యూనిస్టు పార్టీ ఆమోదం
బీజింగ్: యావత్ ప్రపంచం అనుకున్నదే జరిగింది. చైనాకు జీవితకాల అధినాయకుడిగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను నియమించేందుకు వీలుగా చారిత్రక తీర్మానానికి అక్కడి అధికార కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) గురువారం ఆమోదముద్ర వేసింది. ఈ తీర్మానంతో వచ్చే ఏడాది జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీపీసీ 100 ఏళ్ల చరిత్రలో ఇది మూడో చరిత్రాత్మక తీర్మానం కావడం విశేషం.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా పొలిట్ బ్యూరో 19వ సెంట్రల్ కమిటీ ఆరో ప్లీనరీ సమావేశం నవంబరు 8న ప్రారంభమైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశంలో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొని ఈ కీలక తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ శుక్రవారం వెల్లడించనుంది.
సాధారణంగా చైనా కమ్యూనిస్టు పార్టీలోని పొలిట్ బ్యూరోలో రిటైర్మెంట్ వయస్సు 68 ఏళ్లు. ప్రస్తుతం జిన్‌పింగ్ ఆ వయస్సుకు చేరుకున్నారు. అంతేగాక, వచ్చే ఏడాదికి ఆయన పదవీకాలం రెండు పర్యాయాలు ముగుస్తుంది. ఉన్నత నాయకులెవరూ రెండు సార్లకు మించి పదవిలో కొనసాగకూడదనీ, 68 ఏళ్లు నిండిన తరవాత రిటైరైపోవలసిందేనని కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్ తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్ జియవోపింగ్ నిర్దేశించారు. అయితే ఈ నిబంధనను మారుస్తూ మూడేళ్ల క్రితం జిన్‌పింగ్ సర్కారు రాజ్యాంగంలో కీలక సవరణ చేసింది. దీంతో రెండు పర్యాయాల పదవీకాల పరిమితి నుంచి దేశాధ్యక్షుడికి మినహాయింపు కల్పించింది. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్ మూడో సారి పగ్గాలు చేపట్టేందుకు ఆ సవరణ మార్గం కల్పించింది. ఇక ఇప్పుడు ప్లీనరీ ఆమోదించిన తాజా చారిత్రక తీర్మానంతో చైనాపై జిన్‌పింగ్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు అవకాశం లభించినట్లయింది.
2022 రెండో అర్ధభాగంలో సీపీసీ 20వ జాతీయ కాంగ్రెస్‌ను నిర్వహించాలని ప్లీనరీ నిర్ణయించింది. ఆ సమావేశాల్లోనే మూడోసారి జిన్‌పింగ్‌కు అధికారికంగా మూడోసారి దేశ పగ్గాలు అప్పజెప్పే అవకాశముంది. జిన్‌పింగ్ చైనాలోని మూడు అధికార కేంద్రాలకూ నాయకుడిగా కొనసాగుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా సాయుధ దళాల అధిష్ఠానమైన కేంద్ర మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా, దేశాధ్యక్షుడిగా తనే చక్రం తిప్పుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో మావో తర్వాత అంతటి శక్తిమంతమైన నేతగా గుర్తింపు సాధించారు.
మూడో చారిత్రక తీర్మానం..
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా తన వందేళ్ల చరిత్రలో చేసిన మూడో చరిత్రాత్మక తీర్మానం ఇది. 1945లో మావో అధికారాలు బలోపేతం చేసేందుకు, 1981లో డెంగ్ జియావో పింగ్ సమయంలో ఆర్థిక వ్యవస్థను పెట్టుబడుల కోసం తెరిచేందుకు సీపీసీ చారిత్రక తీర్మానాలను ఆమోదించింది. తాజా తీర్మానంతో మావో, డెంగ్‌లతో సమానంగా చైనాను బలోపేతం చేసిన వ్యక్తిగా షీ జిన్‌పింగ్‌కు ప్రాముఖ్యం కల్పించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.