China: చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక భేటీ.. జిన్​పింగ్​కు మూడోసారి పగ్గాలు!

చైనా రాజకీయాల్లో కీలక ఘట్టానికి వేదికగా నిలిచే చైనా కమ్యూనిస్టు పార్టీ( సీపీసీ) నాలుగు రోజుల కాంక్లేవ్ సోమవారం ప్రారంభమైంది. ఆ దేశాధ్యక్షుడు షీ జిన్​పింగ్​కు మూడోసారి అధికారం కట్టబెట్టే ‘చారిత్రక తీర్మానం’......

Published : 08 Nov 2021 17:04 IST

బీజింగ్‌: చైనా రాజకీయాల్లో కీలక ఘట్టానికి వేదికగా నిలిచే చైనా కమ్యూనిస్టు పార్టీ( సీపీసీ) నాలుగు రోజుల కాంక్లేవ్ సోమవారం ప్రారంభమైంది. ఆ దేశాధ్యక్షుడు షీ జిన్​పింగ్​కు మూడోసారి అధికారం కట్టబెట్టే ‘చారిత్రక తీర్మానం’ ఈ సమావేశాల్లో ఆమోదం పొందనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. దేశ రాజధాని బీజింగ్‌లో జరిగిన ఈ సమావేశాలకు 400 మంది సీపీసీ సెంట్రల్ కమిటీ సభ్యులు హాజరయ్యారని ప్రభుత్వ వార్తా ఏజెన్సీ తెలిపింది.

వచ్చే ఏడాది చైనా జాతీయ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్న నేపథ్యంలో రాజకీయంగా ఈ సమావేశం జిన్​పింగ్​కు చాలా కీలకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సీపీసీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఆ స్థాయిలో శక్తిమంతమైన నేతగా మారిన జిన్​పింగ్ జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందని, అందుకు ఈ సమావేశాలే కీలకమని అంటున్నారు. జిన్​పింగ్ మినహా తమ రెండో దఫా అధికారం చేపట్టి పూర్తిచేసుకున్న నేతలందరూ పదవిలో నుంచి దిగిపోయే అవకాశం ఉంది.

ఆ నిబంధనను మార్చేసి..

రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన వారు మరోసారి పోటీ చేయకూడదనే నిబంధన ఇదివరకు ఉండగా.. దీన్ని 2018 రాజ్యాంగ సవరణ ద్వారా జిన్​పింగ్ మార్చేశారు. వచ్చే ఏడాది జిన్​పింగ్ రెండోదఫా అధ్యక్ష పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయన ఆశిస్తున్నారు. సీపీసీలో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగిన జిన్​పింగ్.. ఇప్పటికే పార్టీలోని కీలక స్థానాలను తన ఆధీనంలో పెట్టుకున్నారు. దేశాధ్యక్షుడిగా, సీపీసీ జనరల్ సెక్రెటరీగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్​గా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

వయోపరిమితి నిబంధనపై కీలక ప్రకటనలు!

పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలను సమావేశాల చివరి రోజున ప్రకటించడం ఆనవాయితీ. సంస్కరణలు, కొత్త నియామకాలు, సిద్ధాంతాలు, పార్టీ బలోపేతానికి చేపట్టే చర్యలను చివరి రోజు వివరిస్తారు. తాజా సమావేశాల్లో కొత్త అధ్యక్షుడి ఎంపిక సహా పార్టీలో పదవులు చేపట్టేందుకు ఉన్న వయోపరిమితి నిబంధనపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 68 ఏళ్లు దాటిన వారు అనధికారికంగా పదవీ విరమణ చేసే సంప్రదాయాన్ని మావో జెడాంగ్‌ తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్ షియావోపింగ్ తీసుకొచ్చారు. దీని ప్రకారం చూస్తే.. ప్రస్తుత పొలిట్​బ్యూరోలోని 25 మంది సభ్యుల్లో 12 మందికి వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి 68 ఏళ్లు దాటుతాయి. ఈ నేపథ్యంలో ఈ నిబంధనను సడలిస్తారా అనే అంశంపై తాజా సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

జిన్‌పింగ్‌ స్థానాన్ని సుస్థిరం చేసేలా మూడో చారిత్రక తీర్మానం

తాజాగా ప్రవేశపెట్టనున్న తీర్మానం పార్టీ చరిత్రలోనే ప్రత్యేకమైనది. వందేళ్ల సీపీసీ చరిత్రలో ‘చారిత్రక తీర్మానాన్ని’ రెండుసార్లు మాత్రమే ప్రవేశపెట్టారు. 1945లో మావో, సాంస్కృతిక విప్లవం పేరుతో 1981లో డెంగ్.. చారిత్రక తీర్మానాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవేశపెట్టనున్న మూడో చారిత్రక తీర్మానం ఇదే కానుంది. జిన్​పింగ్ రాజకీయ స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా తీర్మానం ఉంటుందని చైనా రాజకీయ విశ్లేషకుడు వాంగ్ షింగ్వేయి పేర్కొన్నారు. పార్టీ తర్వాతి నాయకత్వం గురించి ప్రస్తావించే అవకాశాలు లేవని అన్నారు. పార్టీపై జిన్​పింగ్​కు ఉన్న పట్టు, ఆయన శక్తిసామర్థ్యాలు ఈ తీర్మానం ద్వారా మరోసారి నిరూపితమవుతాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని