
Indian Air Force: చైనా యుద్ధ విమానాలు మోహరించే ఉన్నాయి
ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి
దిల్లీ: తూర్పు లద్ధాఖ్ సమీపంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు అవతలి వైపు మూడు స్థావరాల్లో చైనా ఎయిర్ ఫోర్స్ దళాలు ఇంకా మోహరించి ఉన్నాయని భారత వాయుసేన(ఐఏఎఫ్) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి వెల్లడించారు. మరోవైపు ఐఏఎఫ్ కూడా అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఇటీవల భారత వాయుసేనలో రఫేల్, అపాచీలను ప్రవేశపెట్టడంతో పోరాట సామర్థ్యం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఐఏఎఫ్ 89వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. లద్ధాఖ్ సమీపంలో చైనా వాయుసేన కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యం బలహీనమేనన్నారు. చైనా, పాకిస్థాన్ భాగస్వామ్యంపై కూడ భయపడాల్సిన అవసరం లేదని, కానీ.. పాకిస్థాన్ నుంచి చైనాకు పాశ్చాత్య సాంకేతికత ఎగుమతవుతుండటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
‘త్రివిధ దళాల అనుసంధానంతో మెరుగైన ఫలితాలు’
ఐఏఎఫ్‌పై సైబర్ దాడుల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. త్రివిధ దళాల అనుసంధానంపై ఐఏఎఫ్ సానుకూలంగా ఉందని చెప్పారు. ఈ మూడింటి ఉమ్మడి ప్రణాళిక, వాటి అమలుతో పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. చౌదరి ఇటీవలే ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా నుంచి ‘చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్’గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిదే. ఇదిలా ఉండగా.. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా తన బలగాలను నానాటికీ పెంచుతోందని, మౌలిక సదుపాయాలూ మెరుగుపర్చుకుంటోందని భారత సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణె సైతం ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.