Ladakh: సరిహద్దుల్లో చైనా కుయుక్తులు.. గుట్టుచప్పుడు కాకుండా ఆయుధాల తరలింపు..!

సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడంలో భాగంగా తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనా తమ సైన్యాలను క్రమంగా వెనక్కి తీసుకుంటున్నాయి.

Published : 10 Aug 2021 19:55 IST

లద్దాఖ్‌: సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడంలో భాగంగా తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనా తమ సైన్యాలను క్రమంగా వెనక్కి తీసుకుంటున్నాయి. అయితే ఓవైపు డ్రాగన్‌ తన సైన్యాన్ని వెనక్కి రప్పిస్తూ.. మరోవైపు కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది. గల్వాన్‌, పాంగాంగ్‌ సరస్సు ఇరు తీరాలు, గోగ్రా ప్రాంతాలను చైనా సైన్యం ఖాళీ చేసింది. కానీ గుట్టుచప్పుడు కాకుండా ఆ ప్రాంతాల్లోకి తమ అధునాతన ఆయుధాలను తరలిస్తోంది. ఇటీవల అధునాతన మోర్టార్లు సహా సుదూర లక్ష్యాలను సునాయాసంగా ఛేదించే రాకెట్లను ప్రయోగించగల పీహెచ్ఎల్-03 రాకెట్‌ లాంచర్లను అక్కడికి చేరవేయడంతో డ్రాగన్‌ కుట్రలు మరోసారి  బహిర్గతమయ్యాయి. గతంలోనూ వాస్తవాధీన రేఖ వద్దకు తేలికపాటి టైప్‌-15 యుద్ధ ట్యాంకులను తరలించింది. పాంగాంగ్‌ ప్రాంతంలో సుమారు వందకు పైగా జెడ్‌టీజెడ్‌-99, జెడ్‌టీజెడ్‌-88 యుద్ధ ట్యాంకులను నిలిపింది. గతేడాది మాదిరిగానే పీసీఎల్‌-181 మోడల్‌ 155ఎమ్‌ఎమ్‌ హోవిట్జర్‌లను కూడా ఆ ప్రాంతాలకు తరలించింది. అక్కడ జెడ్-8 రకం హెలికాప్టర్లు, భారీగా నిఘా పరికరాలు ఉన్నట్టు సమాచారం.

భారత్‌, చైనాల మధ్య సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలను చల్లార్చడమే లక్ష్యంగా.. ఇరుదేశాల విదేశీ వ్యవహారాల శాఖలు సహా, సైనికాధికారుల మధ్య 12 విడతలుగా చర్చలు జరిగాయి. అయితే హాట్‌ స్ప్రింగ్స్‌, దెస్పాంగ్‌ ప్రాంతాల్లో మాత్రం బలగాల ఉపసంహరణకు చైనా మొండికేస్తోంది. లద్దాఖ్‌ సహా.. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ సమీపంలోని వివాదాస్పద షింకియాంగ్‌ ప్రాంతంలోనూ పీహెచ్ఎల్-03 రాకెట్‌ లాంచర్లను చైనా మోహరించింది. వీటితో పాటు బలగాలను వేగంగా తరలించేందుకు వీలుగా 89ఏ మోడల్‌ సాయుధ వాహనాలు, జెడ్‌-11 హెలికాప్టర్లు, అధునాతన పదాతిదళ పోరాట వాహనాలను అక్కడికి చేరవేసింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని