Published : 04 Sep 2021 01:17 IST

Afghanistan: చైనా మాకు అండగా నిలుస్తుందన్న తాలిబన్ల ప్రతినిధి

కాబుల్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు చైనా అండగా నిలుస్తుందని తాలిబన్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. అఫ్గాన్ పునర్‌ నిర్మాణానికి చైనా సిద్ధంగా ఉందని.. తమ దేశ పురోగతికి డ్రాగన్‌పైనే ఆధారపడాలని భావిస్తున్నామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. చైనాను తాము అత్యంత ముఖ్య భాగస్వామిగా చూస్తున్నామన్నారు. అఫ్గాన్‌లో ఆకలి దప్పులు విపరీతంగా పెరిగాయని, ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చిందన్న నివేదికలపై ఆయన స్పందించారు. తమ వద్ద భారీగా గనులు ఉన్నాయని.. అవి అఫ్గాన్‌ను పునర్‌ నిర్మించేందుకు దోహదపడతాయని ముజాహిద్  తెలిపారు. క్లిష్ట సమయంలో తమకు చైనా సాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డ్రాగన్ చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్, చైనా మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు తాము అత్యంత గౌరవిస్తున్నామని తెలిపారు.

తమ వద్ద ఉన్న భారీ గనులను చైనాకు విక్రయించి లబ్ధి పొందాలని తాలిబన్లు భావిస్తున్నారు. ‘దేశంలో ఎంతో విలువైన రాగి గనులున్నాయి. అవి అఫ్గాన్‌ను ఆధునికీకరించేందుకు ఎంతో సహకరిస్తాయి. ఈ ఖనిజాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ చేసేందుకు చైనా మాకు తోడుగా నిలుస్తుంది’ అని ముజాహిద్‌ పేర్కొన్నారు. రష్యాను కూడా ముఖ్యమైన భాగస్వామిగా చూస్తున్నట్లు తాలిబన్ల ప్రతినిధి వెల్లడించారు. ఆ దేశంతోనూ మంచి సంబంధాలు కొనసాగించనున్నట్లు తెలిపారు.

తాలిబన్ల ఆక్రమిత అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లో ఆహార సంక్షోభం తీవ్రమవుతోంది. ఇప్పటికే దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా నిండుకునే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే పలు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించి, వారితో వ్యాపారాలు జరపాలని తాలిబన్లు భావిస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని