భారత భూభాగంలోకి చైనా జవాన్‌

సరిహద్దు వివాదంతో లద్దాఖ్‌లో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. పొరుగు దేశం జవాను ఒకరు భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని

Updated : 11 Jan 2021 12:18 IST

లద్దాఖ్‌: సరిహద్దు వివాదంతో లద్దాఖ్‌లో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. పొరుగు దేశం జవాను ఒకరు భారత భూభాగంలోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని శుక్రవారం భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 

‘శుక్రవారం తెల్లవారుజామున పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌ వైపు ఓ చైనా సైనికుడిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ జవాను వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి రాగా.. బలగాలు కస్టడీలోకి తీసుకున్నాయి’ అని ఆర్మీ అధికారులు శనివారం వెల్లడించారు. నిబంధనల ప్రకారమే ఆ సైనికుడిని విచారిస్తున్నామని, సరిహద్దు దాటాల్సిన పరిస్థితులపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. జవాను గురించి చైనా సైన్యానికి కూడా సమాచారం అందించినట్లు వెల్లడించారు. 

కాగా.. చైనా జవాను భారత భూభాగంలోకి రావడం గత నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది అక్టోబరులో తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్‌ సెక్టార్‌లో పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనికుడిని భారత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మూడు రోజుల దర్యాప్తు అనంతరం ఆ జవాను తిరిగి తమ దేశానికి వెళ్లారు. లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంతో గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత జూన్‌లో గల్వాన్‌ లోయలో ఇరుదేశాల జవాన్ల ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఉద్రిక్తతలపై ఇరు దేశాలు ఇప్పటికే పలుమార్లు సైనికపరమైన చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లభించలేదు. గల్వాన్‌ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. చైనావైపు కూడా చాలా మందే మరణించారు. 

ఇవీ చదవండి..

చైనాతో ‘గస్తీ’మే సవాల్‌!

లద్దాఖ్‌లో గడ్డకట్టిన ఉత్కంఠ..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని