డ్రాగన్‌ ‘ప్లాన్‌’ ప్రకారమే..

సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవి (ప్లాన్‌) జలాంతర్గాముల కోసం తరచూ భారత్‌ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది

Updated : 17 Jan 2021 17:09 IST

 రహస్యంగా చైనా నౌక సంచారం..!

 ఇండోనేషియాలో దొరికిపోయి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

సముద్ర జలాల్లో చైనా అరాచకాలు మెల్లగా విస్తరిస్తున్నాయి. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవి (ప్లాన్‌)కి చెందిన జలాంతర్గాముల కోసం తరచూ భారత్‌ చుట్టుపక్కల జలాల్లో కీలక సమాచార సేకరణ చేపడుతోంది. ఇందుకోసం సముద్ర సరిహద్దులను యథేచ్చగా ఉల్లంఘిస్తోంది. అంతేకాదు.. నౌకలకు సంబంధించిన కీలక సమాచార వ్యవస్థలను ఆఫ్‌ చేసి ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఇండోనేషియా అధికారులు బయటపెట్టారు. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రాన్ని మింగేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న డ్రాగన్‌.. తన సబ్‌మెరైన్లకు అత్యంత కీలక సమాచారం అందజేసేందుకు ఈ నిఘా కార్యక్రమాలు చేపడుతోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. తాజాగా జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 సర్వే‌ నౌక వార్తల్లో నిలిచింది. గత రెండేళ్లలో ఈ నౌక పలు మార్లు ఇలాంటి పనులు చేసినట్లు తేలింది.

స్మగ్లర్ల స్టైల్లో..

జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 నౌక జనవరి 6వ తేదీన హైనాన్‌ ద్వీపం నుంచి బయల్దేరింది. దీనిని జనవరి 11వ తేదీన ఇండోనేషియా కోస్టుగార్డు దళం సిబ్బంది అడ్డుకొన్నారు. అత్యంత కీలకమైన సుండా జలసంధి వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ జలసంధి నుంచి నౌకలు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా ఏఐఎస్‌ వ్యవస్థ ఆన్‌లో ఉండాలి.  గాల్లోకి ఎగిరిన విమానాలు ఎక్కడున్నాయో తెలుసుకొనేందుకు ట్రాన్స్‌పాండర్లు ఎలా ఉపయోగపడతాయో.. అలానే సముద్ర జలాల్లో సంచరించే నౌకలకు ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌(ఏఐఎస్‌) పనిచేస్తుంది. నౌకల సంచారాన్ని ఉపగ్రహాలు పసిగట్టేందుకు ఉపయోగపడతాయి. దీంతో ఉపగ్రహాలు వాటికి సముద్ర మార్గాలను తెలియజేస్తాయి.. అంతేకాదు ఇతర దేశాల సముద్ర జలాల్లోకి చొరబడకుండా చూస్తాయి. ఇండోనేషియా ద్వీప సమూహం కావడంతో ఏ నౌక ఏ ద్వీపం వద్ద నుంచి వెళ్తుందో అక్కడి కోస్టుగార్డ్‌లు తెలుసుకోవడానికి ఇది కీలకం. ఉత్తరకొరియా వంటి దేశాల నౌకలు స్మగ్లింగ్‌కు పాల్పడేందుకు వీటిని సముద్రం మధ్యలో ఆపేస్తాయి.

జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 సిబ్బంది దీనిని ఆన్‌లో ఉంచలేదు. ఈ వ్యవస్థ దెబ్బతిందని చెబుతున్నారు. కానీ, ది మ్యారిటైమ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కథనం ప్రకారం మాత్రం నటూనా ద్వీపాల వద్ద నుంచి వెళ్లేటప్పుడు రెండు సార్లు ఏఐఎస్‌ వ్యవస్థను ఆపేశారని తేలింది. నటూనా ద్వీపం వద్ద సముద్రజలాలపై హక్కు విషయంలో  చైనాతో ఇండోనేషియాకు వివాదం కొనసాగుతోంది.  ఇటీవలే ఇండోనేషియా సముద్ర జలాల్లో చైనా అండర్‌వాటర్‌ డ్రోన్లు కీలక సమాచారం సేకరిస్తూ దొరికాయి. ఆ తర్వాత వెంటనే ఈఘటన చోటు చేసుకొంది.

జలాంతర్గాముల  కోసం సమాచారం..

తాజాగా జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 సర్వే నౌక కూడా సుండా జలసంధి, లొంబాక్‌ జలసంధి, మలక్కా జలసంధి వద్ద సమాచార సేకరణ చేస్తోంది. ఈ మూడు మార్గాలు దక్షిణ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చేందుకు అత్యంత కీలకమైనవి. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళం కార్యకలాపాలు చేపట్టాలంటే అవసరమైన సురక్షిత మార్గాలకోసం ఇది గాలిస్తోంది. ఈ నౌక పలు మార్లు ఈ మార్గాల్లో సర్వేచేసింది. 2019లో సుండా జలసంధి నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చి సముద్రం అడుగున సర్వే చేసింది. బంగాళాఖాతంలోకి కూడా వచ్చి సమాచారం సేకరించింది. ఆ మార్గాలన్నీ భారత్‌, ఆస్ట్రేలియా జలాంతర్గాముల కార్యకలాపాలకు అత్యంత కీలకమైనవి. 2019లో షియాన్‌ -1 అనే నౌక పోర్టుబ్లేయర్‌ వద్ద సమచారం సేకరిస్తుండటంతో నౌకాదళం హెచ్చరించి పంపిందని నేవీచీఫ్‌ అడ్మిరల్‌ కబీర్‌ గతంలో వెల్లడించారు. తాజాగా జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 03 కార్యకలాపాలు కూడా జలాంతర్గాముల కోసమే అని భావిస్తున్నారు. దీనిపై ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విశ్లేషకుడు మాల్కం డేవిస్‌ స్పందించారు. ‘చైనా ఇండోనేషియా జలాల్లోకి వచ్చిందంటే ఒక కన్నేసి ఉంచాల్సిందే. వారు ఎందుకు వచ్చారు.. ఏమి చేస్తున్నారో తెలుసుకోవడం అత్యంత కీలకం’ అని పేర్కొన్నారు. 

2030 నాటికి ఆసియాలో చైనా జలాంతర్గాములదే హవా..

2030 నాటికి చైనా ఆసియాలో అతిపెద్ద జలశక్తిగా మారే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణుడు హెచ్‌ఐ సట్టన్‌ 2020లో ఫోర్బ్స్‌కు రాసిన కథనంలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వివిధ దేశాలకు చెందిన 239 సబ్‌మెరైన్లు నిశ్శబ్దంగా సముద్ర జలాల్లో ఉన్నాయి. 2030 నాటికి ఈ ప్రాంతంలో మరో 220 కొత్తగా వచ్చే అవకాశం ఉంది. చైనా వద్ద ఏకంగా 79 వరకు ఉండవచ్చని అంచనా. ప్రపంచంలోనే అత్యధిక సబ్‌మెరైన్లు ఉన్న దేశంగా చైనా నిలిచే అవకాశం ఉందని సట్టన్‌ తెలిపారు.  భారత్‌కు కూడా అప్పటికి దాదాపు 21 సబ్‌మెరైన్లు ఉండవచ్చని అంచనావేశారు. దీనికంటే చైనా బలగం దాదాపు రెండురెట్లకు పైగా ఉండనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం చైనా నేవీ చుట్టుపక్కల సముద్ర జలాల్లో సమాచారాన్ని ముందుగానే సేకరిస్తోంది. 

ఇవీ చదవండి

లద్దాఖ్‌లో గడ్డకట్టిన ఉత్కంఠ..!

మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని