Chipko: ఉద్యమ నేత సుందర్‌లాల్‌ ఇకలేరు

ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్‌లాల్ బహుగుణ (94)కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయనను చికిత్స నిమిత్తం మే 8న రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు....

Updated : 21 May 2021 14:57 IST

రిషికేశ్‌: ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్‌లాల్ బహుగుణ (94)కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయనను చికిత్స నిమిత్తం మే 8న రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కరోనా నుంచి కోలుకోలేకపోయారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శనివారం రిషికేశ్‌లోని గంగానది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

సుందర్‌లాగ్ బహుగుణ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. పర్యావరణంతో మమేకమై జీవించే మన శతాబ్దాల సంస్కృతికి ఒక రూపం ఇచ్చారన్నారు. ఆయన నిరాడంబరత, నిబద్ధతతో కొనసాగించిన పోరాట స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేమన్నారు. వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేతను వ్యతిరేకిస్తూ సుందర్‌లాల్‌ బహుగుణ ఎన్నో ఉద్యమాలు చేశారు. పర్యావరణ ప్రాముఖ్యత అందరికీ అర్థమయ్యే రీతిలో 1970ల్లో ప్రారంభించిన చిప్కో ఉద్యమానికి నేతృత్వం వహించారు. దీంతో  ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అనంతరం టెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమంలోనూ సుందర్‌లాల్ ప్రముఖ పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1981లో పద్మశ్రీ, 2009లో పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని