Choksi: ఆ అమ్మాయి నా భర్త గర్ల్‌ఫ్రెండ్‌ కాదు! 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించి, విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. డొమినికాకు ఆయన వెంట వెళ్లిన మహిళ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ....

Published : 03 Jun 2021 01:28 IST

స్పందించిన చోక్సీ భార్య ప్రీతి చోక్సీ

దిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసగించి, విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. డొమినికాకు ఆయన వెంట వెళ్లిన మహిళ.. ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ మెహుల్‌ ఛోక్సీ భార్య ప్రీతి ఛోక్సీ స్పందించారు. ఆమె తన భర్త గర్ల్‌ఫ్రెండ్‌ కాదని, మెహుల్‌కు తెలిసిన వ్యక్తేనని స్పష్టంచేశారు. ఛోక్సీ వెంట ఉన్న అమ్మాయి ఆయనతో పాటు అతడి సన్నిహితులకు కూడా తెలుసని వెల్లడించారు. ఆంటిగ్వాను సందర్శించిన సందర్భాల్లో ఛోక్సీతో వాక్‌ చేస్తుంటుందన్నారు. అయితే, చోక్సీతో నడిచిన మహిళ, మీడియా ఛానళ్లలో చూపిస్తున్న మహిళ ఒకరు కాదని తెలిపారు. ఛోక్సీ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి విందు కోసం డొమినికా వెళ్లి ఉంటాడంటూ ఆంటిగ్వా-బార్బుడా ప్రధాని గస్టన్ బ్రౌనే ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఛోక్సీ భార్య పైవిధంగా స్పందించారు.

డొమినికాలో ఛోక్సీని హింసిస్తున్నారన్న వార్తలపైనా ప్రీతి స్పందిస్తూ.. తన భర్త విషయంలో మానవ హక్కులను విస్మరించి హింసకు గురిచేయడం తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఆయన్ను సజీవంగా రప్పించాలనుకున్నప్పుడు హింసించాల్సిన అవసరమేంటి? ఆయన్ను భౌతికంగా, మానసికంగా వేధించడం ఎందుకు? అని ప్రశ్నించారు. తన భర్తకు అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు తెలిపారు.

మరోవైపు, ఛోక్సీని డొమినికా నుంచి భారత్‌ రప్పించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకు అవసరమైన పత్రాలను ఓ ప్రైవేటు విమానంలో భారత్‌ పంపిందని ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ ఇటీవల తెలిపారు. మరోవైపు, గాయాలతో జైలులో ఉన్న ఫొటోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13,500 కోట్లు ఎగువేసిన కేసులో ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్‌ మోదీ కీలక నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. నీరవ్‌ మోదీ ప్రస్తుతం లండన్‌ జైలులో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని