సువేందు నివాసంలో మరోసారి సీఐడీ సోదాలు

పశ్చిమ బెంగాల్‌ భాజపా నేత సువేందు అధికారి ఇంటిపై సీఐడీ మరోసారి దాడులు నిర్వహించింది. 2018లో ఆత్మహత్యకు పాల్పడిన ఆయన బాడీగార్డ్‌

Updated : 18 Jul 2021 00:14 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ భాజపా నేత సువేందు అధికారి ఇంటిపై సీఐడీ మరోసారి దాడులు నిర్వహించింది. 2018లో ఆత్మహత్యకు పాల్పడిన ఆయన బాడీగార్డ్‌ శుభబ్రత చక్రవర్తి కేసు దర్యాప్తు నేపథ్యంలో పూర్వ మేధినీపుర్‌లోని ఆయన నివాసంలో శనివారం సోదాలు చేసింది. అంతకుముందు బుధవారం సువేందు ఇంటి సమీపంలో ఉంటున్న ఆయన డ్రైవర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ బృందం విచారించింది. చనిపోయిన బాడీగార్డ్‌తో గతంలో కలిసి పని చేసిన సిబ్బందిని శుక్రవారం రాత్రి సుమారు  ఏడు గంటల పాటు నలుగురు అధికారుల సీఐడీ బృందం ప్రశ్నించింది. వారి నుంచి సమాచారం సేకరించిన అనంతరం తదుపరి దర్యాప్తు కోసం ఆ బృందం సువేందు ఇంటికి వెళ్లి తాజాగా దర్యాప్తు చేపట్టింది.  ఈ కేసుకు సంబంధించి సువేందు సోదరుడు, తమ్లుక్‌ ఎంపీ దివ్యేందు అధికారినీ అధికారులు ప్రశ్నించారు.

గతంలో సువేందు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన భద్రతా సిబ్బందిలో  రాష్ట్ర సాయుధ బలగాలకు చెందిన శుభబ్రత చక్రవర్తి విధులు నిర్వర్తించాడు. 2018లో సువేందు ఇంటి పక్కన ఉన్న పోలీసుల బ్యారక్‌లో అతడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శుభబ్రత చక్రవర్తి మృతికి సంబంధించి దర్యాప్తు చేయాలంటూ అతడి భార్య సుపర్ణ చక్రవర్తి ఇటీవల కాంతి పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసును ప్రభుత్వం తాజాగా సీఐడీకి అప్పగించింది. 

   

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని