Cinema Halls: సినిమాహాళ్లలోకి బయటి ఆహారం.. సుప్రీం కీలక తీర్పు

థియేటర్లలోకి బయటి నుంచి ఆహారం అనుమతించడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మల్టీప్లెక్స్‌లు, సినిమాహాళ్లు యజమానుల ప్రైవేటు ఆస్తి కాబట్టి, షరతులు నిబంధనలు విధించే అధికారం వారికి ఉంటుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Updated : 03 Jan 2023 20:53 IST

దిల్లీ: మల్టీప్లెక్స్‌, సినిమాహాళ్లలో  బయటి ఆహారం అనుమతించడంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. బయటి నుంచి తెచ్చుకునే ఆహారంపై నిషేధం విధించే హక్కు మల్టీప్లెక్స్‌, థియేటర్‌ యాజమాన్యాలకు ఉందని తెలిపింది. అయితే చిన్నారులు, పిల్లల కోసం ఆహారం తెచ్చుకునే తల్లిదండ్రులను అనుమతించాలని సూచించింది. అలానే ప్రేక్షకులందరికీ ఉచితంగా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించింది. థియేటర్లలోకి బయటి నుంచి తెచ్చుకునే ఆహారంపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తూ జమ్మూకశ్మీర్‌ హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై  మంగళవారం సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. 

థియేటర్లు, మల్టీప్లెక్సులు యజమానుల ప్రైవేటు ఆస్తి కాబట్టి, బయటి నుంచి ఆహారం అనుమతించాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం యాజమాన్యాలకు ఉందని  ధర్మాసనం పేర్కొంది. ప్రేక్షకుడికి కూడా ఎక్కడ సినిమా చూడాలి? అక్కడ అమ్మే వాటిని కొనాలా? వద్దా? అని ఎంచుకునే హక్కు ఉన్నట్లుగానే, థియేటర్‌ యజమానులకు బయటి ఆహారంపై షరతులు విధించే హక్కు ఉంటుందని వెల్లడించింది. అయితే, థియేటర్ లోపల ఉన్న వాటిని కొనుగోలు చేసే విషయంలో ప్రేక్షకులను బలవంతం చేయకూడదని సూచించింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కొన్ని సరదా వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసేందుకు వచ్చే వారిలో ఓ వ్యక్తి బయటి నుంచి జిలేబి తెచ్చి, తిని పాకం చేతులను కూర్చునే సీటుకు తుడిస్తే ఎలా అని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని