విశాఖ వెళ్తాం..‘ఉక్కు’కోసం పోరాడతాం: తపన్‌సేన్‌ 

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెడుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ ఆరోపించారు. విశాఖ ఉక్కు కోసం ప్రజలు పోరాడుతుంటే.. వేర్వేరు మార్గాల్లో పూర్తిగా ......

Updated : 08 Mar 2021 18:17 IST

దిల్లీ: విశాఖ ఉక్కు ఉద్యమానికి పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. వైజాగ్‌ స్టీల్‌ నష్టాలకు కేంద్ర ప్రభుత్వ కారణమని నేతలు అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెడుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ విమర్శించారు. విశాఖ ఉక్కు కోసం ప్రజలు పోరాడుతుంటే.. వేర్వేరు మార్గాల్లో పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూయూ నేతలు కలిసి ఆంధ్రాభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తపన్‌ సేన్‌ మాట్లాడుతూ.. గతంలో కూడా ప్రైవేటీకరించేందుకు చూస్తే పోరాడి అడ్డుకున్నామన్నారు. ఇప్పుడూ అదే పోరాటంతో ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు వైజాగ్‌కు వెళ్లి విశాఖ స్టీల్‌ పరిరక్షణకు పోరాడతామన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలా చేసి విలువైన ప్రజల ఆస్తులను కాపాడేందుకు పోరాటం చేస్తామన్నారు.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఇంతవరకు ప్రత్యేక గనులు కేటాయించలేదని, గనులు కేటాయించి లాభాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. 

నష్టాల్ని బూచిగా చూపి కార్పొరేట్లకు ధారాదత్తమా?

విశాఖ ఉక్కు ఉద్యమంలో తాము భాగస్వాములవుతున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. విశాఖ ఉక్కు  ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదని, ఆంధ్రులు పోరాడి సాధించుకున్నారని గుర్తు చేశారు. తాత్కాలికంగా వచ్చిన నష్టాలను బూచిగా చూపించి కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. ప్రత్యేక గనులు కేటాయించి ఉంటే నష్టాలు వచ్చివి కాదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఏపీ సీఎం జగన్‌పై ఉందన్నారు. ఈ విషయంలో జగన్‌ అన్ని పక్షాలను కలుపుకొని ఎందుకు ముందుకెళ్లడంలేదని వెంకట్‌ ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా చొరవతీసుకొని స్పందించాలని కోరారు. కేంద్రానికి భయపడి తెలుగు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు.  విశాఖ ఉక్కు పరిశ్రమ ఎంతోమంది ప్రాణత్యాగాలతో వచ్చిందని ఏఐకేఎస్‌ సహాయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్‌ అన్నారు. రైతు సంఘాలు విశాఖ వెళ్లి తెలుగుప్రజలకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటామని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని