
Thane: పాపం.. నగరానికి అవార్డు వరిస్తే.. నగర మేయర్‌కే చెప్పలేదట!
ఠాణె (మహరాష్ట్ర): ‘‘పురపాలక అధికారులు నన్ను పట్టించుకోవట్లేదు. నగరానికి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కితే నగర మేయర్నైనా నాకే చెప్పకుండా దాచారు. అవార్డు గురించి పత్రికల్లో వస్తే చదివి తెలుసుకోవాల్సి వచ్చింది’’అని ఠాణె నగర మేయర్ నరేశ్ మాస్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పురపాలక అధికారుల తీరుపై మున్సిపల్ కమిషనర్ విపిన్ శర్మకు ఆయన లేఖ రాశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్ 2021 ర్యాంకింగ్స్‌లో ‘చెత్త రహిత, వ్యర్థాల నిర్వహణ’లో ఠాణె 14వ ర్యాంక్‌లో నిలిచి అవార్డు దక్కించుకుంది. అయితే, ఠాణె మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ)కి అవార్డు వరించిందన్న సమాచారాన్ని ఠాణె మేయర్ నరేశ్‌కు మున్సిపల్ అధికారులు తెలియజేయలేదు. ఆ తర్వాత పత్రికల్లో అవార్డు గురించి తెలుసుకున్న మేయర్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా.. తనను, ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ‘ఏ అవార్డు కార్యక్రమంలోనైనా స్థానిక సంస్థ తరఫున ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి అవార్డు తీసుకుంటారు. కానీ, ఠాణెలో అధికారులు మమ్మల్నే విస్మరించారు. దీనికి కారణమైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి’అని మున్సిపల్ కమిషనర్‌కి రాసిన లేఖలో మేయర్ పేర్కొన్నారు.