CJI: సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ కాపీలు.. ఇక ప్రాంతీయ భాషల్లో..!

ప్రాంతీయ భాషల్లో సుప్రీం కోర్టు తీర్పు ప్రతులు జనవరి 26 నుంచి అందుబాటులో ఉంటాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సెర్చ్‌ ఇంజిన్‌ను త్వరలోనే మరింత మెరుగుపరుస్తామన్నారు.

Published : 25 Jan 2023 21:37 IST

దిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఇచ్చే తీర్పు ప్రతులు ఇక నుంచి ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన సేవలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బుధవారం ప్రారంభించారు. ఎలక్ట్రానిక్‌-సుప్రీం కోర్టు (e-SCR) ప్రాజెక్టులో భాగంగా గణతంత్ర దినోత్సవం నుంచి ఇవి ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయనే విషయాన్ని సుప్రీం కోర్టు న్యాయవాదులకు సీజేఐ వెల్లడించారు.

‘తేలికగా శోధించేందుకు వీలున్న ఎలక్ట్రానిక్‌-సుప్రీం కోర్టు ప్రాజెక్టులో ఇప్పటివరకు 34వేల తీర్పు కాపీలున్నాయి. 1091 తీర్పు ప్రతులు ప్రాంతీయ భాషల్లో ఉన్నాయి. ఇవి జనవరి 26 నుంచి అందుబాటులోకి వస్తాయి’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు.  వీటితోసహా అధికారిక భాషలన్నింటిలో వీటిని అందుబాటులో ఉంచేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్రస్తుతానికి జనవరి 1, 2023 వరకు ఇచ్చిన తీర్పుల ప్రతులు అందుబాటులోకి వస్తాయన్న సీజేఐ.. మరికొన్ని వారాల్లో సెర్చ్‌ ఇంజిన్‌ను మరింత మెరుగుపరుస్తామన్నారు.

ఈ-ఎస్‌సీఆర్‌ ప్రాజెక్టులో భాగంగా 34వేల తీర్పు ప్రతులను న్యాయవాదులు, విద్యార్థులు, సామాన్య పౌరులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తామని జనవరి 2న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఇందులో భాగంగా వీటిని సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌తోపాటు నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ (ఎన్‌జేడీజీ) జడ్జిమెంట్‌ పోర్టల్స్‌లోనూ పొందుపరుస్తామని తెలిపింది. రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 8లో  22 గుర్తింపు పొందిన భాషలున్నాయి. ఇదిలాఉంటే, కోర్టు తీర్పు ప్రతులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇటీవలే ప్రశంసించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని