PM Modi: ప్రాంతీయ భాషల్లో తీర్పు ప్రతులు.. చీఫ్‌ జస్టిస్‌ ఆలోచన ప్రశంసనీయం : మోదీ

సుప్రీం కోర్టు తీర్పు ప్రతులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఆలోచనను ప్రధాని మోదీ ప్రశంసించారు.

Published : 22 Jan 2023 20:04 IST

దిల్లీ: ప్రాంతీయ భాషల్లోనూ సుప్రీం కోర్టు తీర్పులను అందుబాటులో ఉంచాలన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆలోచనను ప్రధాని మోదీ ప్రశంసించారు. సుప్రీం కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇందుకోసం సాంకేతికతను వాడుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది కీర్తించాల్సిన విషయం. ఎంతోమంది పౌరులకు, ముఖ్యంగా యువకులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఇటీవల మహారాష్ట్ర, గోవా బార్‌ కౌన్సిల్‌లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగం వీడియోనూ ప్రధాని మోదీ షేర్‌ చేశారు.

సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లో పొందుపరచాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ గతంలో అనేకసార్లు చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ఆ దిశగా ఆలోచించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వీటిపై మరో ట్వీట్‌ చేసిన మోదీ.. ‘భారత్‌లో ఎన్నో భాషలున్నాయి. ఇవి మన సంస్కృతిని మరింత వర్ధిల్లేలా చేస్తున్నాయి. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ను కూడా మాతృభాషల్లో చదివేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని