CJI: ‘చేతిలో దస్త్రాలు లేని లాయర్‌.. బ్యాట్‌ లేని సచిన్‌ తెందూల్కరే’.. న్యాయవాదికి సుప్రీం కోర్టు చురక!

కేసు ఫైల్‌ లేకుండానే వాదనలకు హాజరైన ఓ లాయర్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) శుక్రవారం తప్పుబట్టింది. కేసు ఫైల్‌ లేని లాయర్.. బ్యాట్ లేని సచిన్ తెందూల్కర్ లాంటివాడేనని చురకంటించింది.

Published : 18 Nov 2022 18:21 IST

దిల్లీ: కోర్టులో వాదనలకు హాజరయ్యే సమయంలో న్యాయవాదులకు తన కేసుతో పాటు ఆయా చట్టపర అంశాలకు సంబంధించిన దస్త్రాలను వెంట పెట్టుకోవడం ముఖ్యం. అయితే, కేసు ఫైల్‌ లేకుండానే వాదనలకు హాజరైన ఓ లాయర్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) శుక్రవారం తప్పుబట్టింది. కేసు ఫైల్‌ లేని లాయర్.. బ్యాట్ లేని సచిన్ తెందూల్కర్ లాంటివాడేనని చురకంటించింది.

ఓ కేసు వాదనల క్రమంలో సదరు లాయర్‌ సంబంధిత దస్త్రాలు లేకుండానే హాజరైనట్లు.. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్(Justice DY Chandrachud), జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం గుర్తించింది. వెంటనే.. అతని తీరును తప్పుబట్టింది. ‘మీరు గౌను, బ్యాండు ధరించి ఉన్నారు. కానీ, చేతిలో కేసు పేపర్లు లేవు. కేసు ఫైల్‌ లేని న్యాయవాది.. బ్యాట్ లేని సచిన్ తెందూల్కర్‌లా ఉంటారు. ఇదేం బాగోదు. ఎల్లప్పుడూ కేసు పత్రాలు మీచెంత ఉండాలి’ అని సీజేఐ సూచించారు.

న్యాయస్థానంలో భాష సమస్య..!

కోర్టు భాష ఇంగ్లీషుగా ఉన్న న్యాయస్థానంలో.. హిందీలో వాదనలు వినిపించిన వ్యవహారం ఇది. తన కేసును తానే వాదించుకునేందుకు ముందుకొచ్చిన ఓ పిటిషనర్‌.. శుక్రవారం జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ముందు హిందీలో వాదన మొదలుపెట్టారు. దీంతో.. ఇద్దరి మధ్య భాషాపర ఇబ్బందులు తలెత్తాయి. ‘ఈ కోర్టు భాష ఇంగ్లీషు. మీరు కోరుకుంటే.. మీ తరఫున ఇంగ్లీషులో వాదించేందుకు వేరే న్యాయవాదిని ఏర్పాటు చేస్తాం’ అని జస్టిస్ జోసెఫ్ సూచించారు. పిటిషనర్‌ సైతం అంగీకరించడంతో.. ఈ మేరకు ఏర్పాటు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని