Supreme Court: మహమ్మారి బలవంతంగా మార్పు తీసుకొచ్చింది: సీజేఐ

నూతన విచారణ పద్ధతులు అవలంబించాల్సిందిగా కరోనా మహమ్మారి (Covid 19) భారత న్యాయవ్యవస్థను బలవంతం చేసిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justic DY Chandrachud) అన్నారు. ఎస్‌సీవో దేశాల ప్రధాన న్యాయమూర్తులు సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 10 Mar 2023 23:35 IST

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి (Covid-19)తో భారత న్యాయవ్యవస్థలో నూతన పద్ధతులు అవలంబించాల్సి వచ్చిందని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justic DY Chandrachud) అన్నారు. సరికొత్త విధానాల ద్వారా కేసుల విచారణ చేపట్టి న్యాయవ్యవస్థ పనితీరును మెరుగుపరిచామన్నారు. షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్స్‌ (SCO) సభ్య దేశాల ప్రధాన న్యాయమూర్తుల 18వ సమావేశం దిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి కాలంలో భారత న్యాయవ్యవస్థ తీసుకున్న కీలక నిర్ణయాలు, విచారణ విధానం గురించి మాట్లాడారు. కరోనా మహమ్మారి సమయంలో జిల్లా కోర్టులు 1.65 కోట్ల కేసులను విచారించగా.. హైకోర్టులు 75.8 లక్షల కేసులు, సుప్రీం కోర్టు 3,79,954 కేసులను విచారించినట్లు సీజేఐ వెల్లడించారు.

‘‘ఆధునిక విచారణ పద్ధతులను అవలంబించాల్సిందిగా కరోనా మహమ్మారి భారత న్యాయవ్యవస్థను బలవంతం చేసింది. క్రియాశీల నిర్ణయాలతో న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో మహమ్మారి కోసం వేచి చూడకుండా నూతన పద్ధతులను అవలంబించాం’’ అని సీజేఐ అన్నారు. మహమ్మారి వ్యాప్తి సమయంలో  మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా చూడటంలో సుప్రీం కోర్టు, హైకోర్టులు కీలక పాత్ర పోషించాయని అన్నారు. న్యాయవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న దానిపై చర్చించడమే ప్రధాన అజెండాగా.. ఎస్‌సీఓ సభ్యదేశాల ప్రధాన న్యాయమూర్తుల సమావేశాలు ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 12 వరకు నిర్వహించనున్నారు. ఎస్‌సీఓలో భారత్‌, చైనా, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, పాకిస్థాన్‌, రష్యా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌, బెలారస్‌, ఇరాన్‌, మంగోలియా దేశాలు ఎస్‌సీవో పరిశీలకులుగా వ్యవహరించగా.. అమెరికా, అజర్‌బైజాన్‌, కాంబోడియా, నేపాల్‌ కూడా ప్రత్యేక సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే ఈ సమావేశాల్లో పాకిస్థాన్‌ తరఫు ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

కొవిడ్‌ వ్యాప్తి సమయంలో భారత్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్న సీజేఐ.. లాక్‌డౌన్‌ మూలంగా రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. సామాజిక దూరం పాటించాల్సి రావడంతో కోర్టుల రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయని, దీంతో ఆన్‌లైన్‌లోనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసులు విచారించామని తెలిపారు. కొవిడ్‌ కాలంలో ఎదురైన ఎన్నో సమస్యలను సుమోటోగా తీసుకొని విచారించామని సీజేఐ గుర్తు చేశారు. వలస కూలీల విషయంలో కోర్టులు తీసుకున్న నిర్ణయాలు, ప్రత్యేక జైళ్ల ఏర్పాటు, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వాలని ఆదేశించడం లాంటి ఎన్నో కీలక నిర్ణయాలు కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంతగానో తోడ్పడ్డాయని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని