CJI: న్యాయ వ్యవస్థకు పెద్ద సవాళ్లు అవే..: సన్మాన సభలో జస్టిస్‌ ఎన్వీ రమణ

శనివారం ఆయనను బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక ప్రసంగం చేశారు. ఖర్చులు, విచారణలో జాప్యమే న్యాయ వ్యవస్థకు పెద్ద సవాల్‌ అన్నారు........

Updated : 04 Sep 2021 17:47 IST

దిల్లీ: బార్‌ కౌన్సిల్‌తో తనకు ఎనలేని అనుబంధం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తన మూలాలు బార్‌ కౌన్సిల్‌ నుంచే మొదలయ్యాయని గుర్తుచేసుకున్నారు. శనివారం ఆయనను బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక ప్రసంగం చేశారు. ఖర్చులు, విచారణలో జాప్యమే న్యాయ వ్యవస్థకు పెద్ద సవాల్‌ అన్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు తన వంతు కృషిచేస్తానని చెప్పారు.

ఆ సమాచారం సేకరిస్తున్నా.. వారంలో నివేదిక ఇస్తా..

‘‘కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కొన్ని కోర్టుల్లో మహిళలకు సరైన వసతులు లేవు. దేశవ్యాప్తంగా సౌకర్యాల లేమిపై సమాచార సేకరణలో ఉన్నా. మరో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందజేస్తా. ఈ నివేదిక ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటాం. సుప్రీం కోర్టులో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నాం. వేర్వేరు హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి పేర్లు సిఫార్సు చేశాం. ఖాళీల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నా. న్యాయశాఖ మంత్రి చొరవ తీసుకుంటారని భావిస్తున్నా’’ అని అన్నారు.

ప్రజల ఆకాంక్షలు అర్థంచేసుకోండి..

‘‘ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత లాయర్లపై ఉంది. న్యాయవాదులు నైతిక విలువలతో పనిచేయాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించాలి. న్యాయ వ్యవస్థపైనా కరోనా మహమ్మారి ప్రభావం చూపింది. అనేకమంది న్యాయవాదులు కొవిడ్‌తో మరణించారు. కొవిడ్‌ వల్ల వర్చువల్‌గా విచారణలు చేపట్టాం. ఈ విధానంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇంటర్నెట్‌ సమస్యలు అధికంగా ఉన్నాయి. సమస్య పరిష్కారానికి న్యాయశాఖ చొరవ కోరుతున్నా. ఇంటర్నెట్‌ సంస్థలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నా’’ అని తెలిపారు.

మహిళల సంఖ్య ఇప్పటికీ తక్కువే..

న్యాయ విద్య అనేది ధనవంతుల వృత్తి అనే భావన ప్రజల్లో నెలకొందని, ఇప్పుడిప్పుడే అందులో మార్పు వస్తోందని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థలో అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికీ పట్టణ ప్రాంతాలకే న్యాయవిద్య పరిమితం అవుతోందన్నారు. న్యాయవ్యవస్థలో మహిళల సంఖ్య ఇంకా తక్కువగానే ఉందని, అతికష్టమ్మీద ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆ సంఖ్యను 11 శాతానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. తాను హైకోర్టులో పనిచేసే రోజుల్లో మహిళలకు కనీసం మరుగుదొడ్లు ఉండేవి కావని, తాను న్యాయమూర్తి అయ్యాక ఆ మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

సామాన్యులకు ప్రాధాన్యం ఇవ్వాలి: రిజిజు

జస్టిస్‌ రమణ ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారని ఆయనను కలిసిన తర్వాతే తెలిసిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. దేశంలో దిగువ కోర్టుల్లో సామాన్యులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందని, అలాంటి వారికి సత్వర న్యాయం జరిగేలా దృష్టి పెట్టాలని సీజేఐని కోరారు. క్లిష్టమైన సమయంలోనూ సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందని కొనియాడారు. జస్టిస్‌ ఎన్వీ రమణ గొప్ప న్యాయమూర్తే కాక.. ఉన్నత విలువలు కలిగిన మానవతా వాది కూడా అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. అంతకుముందు బార్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు, న్యాయశాఖ మంత్రి కలిసి జస్టిస్‌ ఎన్వీ రమణను పూలమాలలతో సత్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని