CJI: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌..!

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నియమితులు కానున్నారు. తదుపరి సీజేగా ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ లలిత్‌ ప్రతిపాదించారు.

Updated : 11 Oct 2022 15:15 IST

దిల్లీ: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 50వ సీజేగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్‌ ప్రతిపాదించారు. ఈ మేరకు మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిబంధన ప్రకారం.. ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ.. ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు.

ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ యు.యు. లలిత్‌ నవంబరు 8వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్‌ యు.యు. లలిత్‌ తర్వాత జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ అత్యంత సీనియర్‌గా ఉన్నారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ నవంబరు 9న ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. 2024 నవంబరు 10న ఆయన పదవీ విరమణ చేస్తారు.

జస్టిస్‌ చంద్రచూడ్ ప్రస్థానమిది..

జస్టిస్‌ ధనుంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ 1959 నవంబరు 11న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ కూడా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన సీజేఐగా గుర్తింపు పొందారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్ తొలుత బాంబే హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. 1998లో భారత అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు. 2016లో పదోన్నతిపై సుప్రీంకోర్టులో నియమితులయ్యారు. 2021 నుంచి సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. నేషనల్ లీగర్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. గోప్యతా హక్కు, శబరిమలలో మహిళల ప్రవేశం సహా అనే కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ చంద్రచూడ్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని