CJI: అప్పట్లో నేనూ మూన్‌లైటింగ్‌ చేశా: సీజేఐ

CJI works as radio jockey: తన యుక్త వయసులో మూన్‌లైటింగ్‌ చేశానన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice Chandrachud). లాయర్‌గా ఉంటూనే రేడియో జాకీగా పనిచేశానని చెప్పారు.

Published : 05 Dec 2022 22:29 IST

దిల్లీ: మూన్‌లైటింగ్‌ (moonlighting) అనే పదం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీ రంగంలో ఈ మధ్యకాలంలో తరచూ వాడుతున్నారు. ఒక కంపెనీతో పనిచేస్తూనే మరో కంపెనీ ప్రాజెక్టులనూ చేపట్టడాన్ని మూన్‌లైటింగ్‌గా పరిగణిస్తారు. దీన్ని సమర్థించేవారూ.. వ్యతిరేకించేవారూ ఉన్నారు. ఈ చర్చను పక్కనపెడితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Justice Chandrachud) సైతం మూన్‌లైటింగ్‌ చేశారట. తాను 20ల్లో ఉన్నప్పుడు మూన్‌లైటింగ్‌ చేశానని ఆయన స్వయంగా చెప్పారు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ‘బార్‌ అండ్‌ బెంచ్‌’ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘‘తాను 20ల్లో ఉన్నప్పుడు ఓ వైపు లాయర్‌గా పనిచేస్తూనే.. మరోవైపు ఆల్‌ ఇండియా రేడియోలో రేడియో జాకీగా పనిచేశా. ‘ప్లే ఇట్‌ కూల్’‌, ‘డేట్‌ విత్‌ యూ’, ‘సండే రిక్వెస్ట్‌’ వంటి ప్రోగ్రాములు చేశా. ఈ విషయం చాలా మందికి తెలీదు’’ అని గత స్మృతులను నెమరువేసుకున్నారు జస్టిస్‌ చంద్రచూడ్‌. ఈ సందర్భంగా తన అభిరుచులనూ పంచుకున్నారు. తనకు మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టమని, రోజూ సంగీతం వినడాన్ని ఇష్టపడతానని తెలిపారు. రోజువారీ జీవితంలో మ్యూజిక్‌ ఇప్పటికీ భాగంగానే ఉందని చెప్పారు. లాయర్ల సంగీతం పూర్తయ్యాక ఇంటికెళ్లి తనకిష్టమైన మ్యూజిక్‌ను ఆస్వాదిస్తానని ఛలోక్తి విసిరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని