శెభాష్.. దేశం ఆశించేది అదే..!: సైన్యానికి మాయావతి ప్రశంస

తవాంగ్‌ సెక్టార్‌ వద్ద చైనా సేనల దూకుడును తిప్పికొట్టిన భారత సైన్యాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశంసించారు. దౌత్యపరమైన చర్యలతో ఉద్రిక్తతలను నివారించాలని కేంద్రాన్ని కోరారు.

Published : 14 Dec 2022 01:54 IST

లఖ్‌నవూ: అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal pradesh)లోని తవాంగ్‌ సెక్టార్‌(Tawang sector) వద్ద ఈ నెల 9న భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి(Mayawati) స్పందించారు. వాస్తవాధీన రేఖ వెంబడి యాంగట్సే వద్ద చైనా సైన్యం దూకుడును తిప్పికొట్టిన భారత సైనికులపై ప్రశంసలు కురిపించారు. ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధంతో ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఘర్షణపై మాయావతి ఆందోళన వ్యక్తంచేశారు. పొరుగు దేశంతో దౌత్య పరమైన చర్యల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నెల 9న జరిగిన ఘర్షణలో భారత్‌-చైనాకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలు కాగా.. ఇరుదేశాలూ తక్షణమే తమ బలగాల్ని వెనక్కి రప్పించాయి.

దేశం ఆశించేది అదే..

భారత్‌ సైనికులతో డ్రాగన్‌ సేనలు ఘర్షణకు దిగడంపై మాయావతి హిందీలో ట్వీట్‌ చేశారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలో పలువురు సైనికులు గాయపడ్డారనే వార్త బాధాకరం. అలాగే, ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలతో ఇప్పటికే ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని దౌత్యపరమైన చర్యల ద్వారా పరిష్కరించుకోవడం అవసరం. ఈ ఘర్షణలో డ్రాగన్‌కు భారత్‌ సైన్యం తగిన రీతిలో సమాధానం చెప్పడం ద్వారా తన కీర్తిని మరోసారి చాటుకుంది. ఇప్పుడు తమ దౌత్య నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దేశం ఆశించేది అదే. మన ఇంటెలిజెన్స్‌ను మరింత బలోపేతం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

మరోవైపు, చైనా సేనల దూకుడుపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.  దీనిపై ఈ ఉదయం లోక్‌సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. దేశ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నించిన చైనా బలగాలను భారత్‌ సైన్యం  దీటుగా తిప్పికొట్టిందన్నారు.  జూన్‌ 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్- చైనా బలగాలు తీవ్రస్థాయిలో ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొనడం ఇదే తొలిసారి. అప్పటి ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచివేసింది. ఆ తర్వాత వివిధ దశల్లో కమాండర్‌ స్థాయి చర్చలు జరిగిన తర్వాత యథాతథ స్థితిని కొనసాగించాలన్న నిబంధనపై ఇరు దేశాలూ తమ బలగాలను వెనక్కి తీసుకున్నప్పటికీ తాజాగా తవాంగ్‌ సెక్టార్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని