అంటార్కిటికాలోహిమఫలకానికి ముప్పు

పెరుగుతున్న భూతాపంతో అంటార్కిటికాలోని మంచు ఫలకాలకు ముప్పు ఏర్పడుతోందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

Published : 10 Apr 2021 08:00 IST

బ్రిటన్‌ శాస్త్రవేత్తల హెచ్చరిక 

దిల్లీ: పెరుగుతున్న భూతాపంతో అంటార్కిటికాలోని మంచు ఫలకాలకు ముప్పు ఏర్పడుతోందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే సరాసరి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే.. అక్కడి హిమఫలకాల్లో మూడో వంతుకుపైగా సముద్రంలో కుప్పకూలుతాయని పేర్కొన్నారు.

సముద్రంలో శాశ్వతంగా తేలియాడే వేదికలు

మంచు ఫలకాలు.. సముద్రంలో శాశ్వతంగా తేలియాడే వేదికలు. అవి తీరప్రాంతాల వెంబడి ఉంటాయి. నేలపై ఉన్న హిమానీనదాల నుంచి నీరు సాగరంలోకి చేరినప్పుడు అవి ఏర్పడుతుంటాయి. అయితే ఆ నీరు అపరిమితంగా సాగరంలోకి వచ్చి చేరి, సముద్ర మట్టాలను అమాంతం పెంచేయకుండా చూడటంలో ఈ మంచు ఫలకాలు చాలా కీలకం. బ్రిటన్‌లోని రీడింగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు సాగించారు. భూతాపం 4 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే.. అంటార్కిటికాలోని మొత్తం మంచు ఫలకాల విస్తీర్ణంలో 34 శాతానికి ముప్పు ఏర్పడొచ్చని తేల్చారు. అంటార్కిటికా ద్వీపకల్పంలోని అతిపెద్ద హిమ ఫలకం ‘లార్సన్‌ సి’కి ఎక్కువ ముప్పు పొంచి ఉందని పరిశోధనలో పాలుపంచుకున్న గిల్బర్ట్‌ తెలిపారు. ‘‘ఆ మంచు కుప్పకూలడం.. ఒక సీసాకు అమర్చిన భారీ మూతను అమాంతంగా తెరవడం లాంటిదే. దీనివల్ల హిమానీదాల నుంచి భారీ పరిమాణంలో నీరు సాగరాల్లోకి వచ్చి చేరుతుంది’’ అని వివరించారు. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం చేస్తే.. తరగిపోయే మంచు ఫలకాల విస్తీర్ణాన్ని సగానికి తగ్గించొచ్చని చెప్పారు. దీనివల్ల సముద్రమట్టం గణనీయంగా పెరగకుండా చూడొచ్చని పేర్కొన్నారు. కరిగిన మంచు.. హిమఫలకాల ఉపరితలంపై పేరుకుపోతున్నట్లు చెప్పారు. దీనివల్ల ఆ ఫలకంలో పగుళ్లు ఏర్పడి, సముద్రంలో కుప్పకూలే అవకాశం ఉందన్నారు. వీటిపై గతంలో నిర్వహించిన అధ్యయనాలు.. మంచు తరుగుదలకు సంబంధించిన ఒక స్థూల చిత్రాన్ని మాత్రమే ఆవిష్కరించాయని చెప్పారు. తాము మాత్రం అధునాతన హై రిజల్యూషన్‌ ప్రాంతీయ వాతావరణ నమూనాలను ఉపయోగించి, సవివర దృశ్యాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని