Power Shortage: కరెంటు సంక్షోభం వేళ.. విద్యుత్‌, నీటిని వివేకంతో వాడుకోండి!

ప్రజలు విద్యుత్‌ను వివేకంతో వాడుకోవాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సూచించారు.

Published : 03 May 2022 01:43 IST

దేశవ్యాప్తంగా విద్యుత్‌ కొరత ఉందన్న రాజస్థాన్‌ సీఎం

జైపుర్‌: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే దాదాపు 35శాతం కరెంటు వినియోగం పెరిగింది. దీంతో డిమాండుకు సరిపడా విద్యుత్‌ను అందించలేక ఆయా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు విద్యుత్‌ను వివేకంతో వాడుకోవాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సూచించారు. ముఖ్యంగా ఎయిర్‌ కండీషనర్లను అనవసరంగా వినియోగించకపోవడమే ఉత్తమమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ఉన్నట్లే రాష్ట్రంలోనూ తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. డిమాండు, సప్లైకి మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. కేంద్ర ఇంధన ఎక్ఛేంజీల నుంచి కరెంటు కొందామన్నా వారివద్ద అందుబాటులో లేదు. ఇటువంటి సమయంలో ప్రజలు విద్యుత్‌, నీటిని పొదుపుగా వాడుకోవడం ఉత్తమం’ అని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వడగాల్పులు వీస్తున్నాయన్న ఆయన.. విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిందన్నారు. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో రెండు నుంచి పది గంటలపాటు కరెంటు కోతలు విధిస్తున్న విషయాన్ని అశోక్‌ గహ్లోత్‌ గుర్తుచేశారు.

మరోవైపు రాజస్థాన్‌లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బికనెర్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. కరెంటు కోతల వల్ల మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో 4142 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్‌, నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని