Published : 26 Jun 2022 13:50 IST

Bypoll Results: రెండు లోక్‌సభ స్థానాల్లో ఉత్కంఠ.. భాజపా, ఎస్‌పీల మధ్య హోరాహోరీ

త్రిపురలో భాజపాకు 3, ఏపీలో వైసీపీ కైవసం

దిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన మూడు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌, ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానాల్లో భాజపా, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల మధ్య స్వల్ప తేడా కొనసాగుతోంది. ప్రతి రౌండు మారేకొద్ది ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య రెండు, మూడు వేల తేడా ఉండడంతో రెండు స్థానాల్లో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 2019లో ఈ రెండు స్థానాలు సమాజ్‌వాదీ పార్టీ చేజిక్కించుకోగా ప్రస్తుత ఫలితాల్లో ఈ రెండుచోట్లా భాజపా అభ్యర్థులు కాస్త ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు పంజాబ్‌లోని సంగ్రూర్‌ లోక్‌సభ స్థానంలో ఆమ్‌ఆద్మీ పార్టీ ఆభ్యర్థి 10వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతకుముందు ఈ స్థానం నుంచి గెలుపొందిన ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ ఇటీవల పంజాబ్‌ ముఖ్యమంత్రిగా నియమితులైన సంగతి తెలిసిందే.

త్రిపురలో భాజపా విజయం..

దేశవ్యాప్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా.. వాటిలో నాలుగు స్థానాలు త్రిపురలోనే ఉన్నాయి. తాజా ఫలితాల్లో భాజపా మూడు స్థానాల్లో గెలుపొందింది. టౌన్‌ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాతోపాటు జుబరాజ్‌నగర్‌, సుర్మా స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాణిక్‌ సాహా, బిప్లబ్‌ దేబ్‌ రాజీనామాతో సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో సీఎం విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. మరో కీలక స్థానమైన అగర్తలా భాజపా సిట్టింగ్‌ స్థానం కాగా.. తాజా ఫలితాల్లో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌ 3వేల ఓట్లతో గెలుపొందారు.

ఝార్ఖండ్‌లోని మందార్‌ నియోజకవర్గ (జేవీఎం సిట్టింగ్‌ స్థానం) ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. దిల్లీ రాజిందర్‌ నగర్ స్థానంలో ఆప్‌ అభ్యర్థి దుర్గేశ్‌ పథక్‌ ముందంజలో ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts