Punjab: ఉచిత వైద్యం.. మరో 400 మొహల్లా క్లీనిక్‌లు ప్రారంభం

పంజాబ్‌ ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యమందించేందుకు మరిన్ని క్లీనిక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 100 క్లీనిక్‌లు ఉండగా.. తాజాగా మరో 400 మొహల్లా క్లీనిక్‌లను దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌ రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు.

Published : 27 Jan 2023 16:47 IST

అమృత్‌సర్‌: దిల్లీ(Delhi) మోడల్‌ పాలన అందిస్తామంటూ పంజాబ్‌(Punjab)లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) అదే దిశగా పనిచేస్తోంది. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ఇప్పటికే 100 మొహల్లా క్లీనిక్‌(Mohalla clinics)లు ప్రారంభించగా.. తాజాగా మరో 400 క్లీనిక్‌లను ఆప్‌ చీఫ్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal), పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌(Bhagwant Mann ) రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. కేవలం 10 నెలల్లోనే 500 మొహల్లా క్లీనిక్‌లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంజాబ్‌ ఆరోగ్యమంత్రి బల్బీర్‌ సింగ్‌, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా తదితరులు పాల్గొన్నారు. 

మేం విద్య, వైద్యం గురించే మాట్లాడతాం.. ద్వేషం గురించి కాదు!

ఈ సందర్భంగా సీఎం  భగవంత్ మాన్‌ మాట్లాడుతూ..  దిల్లీలోని మొహల్లా క్లీనిక్‌లను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సీఎం అక్కడ బస్తీ దావాఖానాలు పెట్టారన్నారు. తమిళనాడు సీఎం దిల్లీ తరహాలో అక్కడ పాఠశాలలు నిర్మిస్తున్నారన్నారు. తాము విద్య, వైద్యం, పరిశ్రమల గురించే మాట్లాడుతున్నామని.. ద్వేషం గురించి కాదన్నారు. ఈ క్లీనిక్‌లకు వచ్చే రోగుల సమస్యలకు సంబంధించిన రికార్డులను వారి మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం చేసి రాష్ట్రంలోని ఏ క్లీనిక్‌లోనైనా వచ్చే విధంగా చేస్తున్నట్టు చెప్పారు. రోగుల రికార్డులను కంప్యూటరీకరిస్తామన్నారు. ఎన్నికల సమయంలో పంజాబీలకు ఇచ్చిన హామీలను నెరవేస్తున్నట్టు చెప్పారు. పంజాబ్‌ను బ్రిటిష్‌ వారి కన్నా రాజకీయ నేతలే దోపిడీ చేశారని మండిపడ్డారు. ఆ దోపిడీని తాము అడ్డుకుంటున్నామన్నారు. 

దేశ రాజధాని దిల్లీ(Delhi) తరహాలోనే పంజాబ్‌(Punjab)లోనూ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఆప్‌ సర్కార్‌(AAP Government) చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను విదేశాల్లో శిక్షణకు పంపించాలని పంజాబ్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఫిబ్రవరి 4న సింగపూర్‌కు తొలి విడతలో 36 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లను పంపించబోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని