Vande Bharat: వందేభారత్‌ భోజనంలో బొద్దింక.. రైల్వేశాఖ ఏమందంటే..?

వందేభారత్‌లో ప్రయాణిస్తున్న దంపతులకు సిబ్బంది నాసిరకం భోజనాన్ని అందించారు. వడ్డించిన పప్పులో బొద్దింక కనిపించిందంటూ చేసిన ఫిర్యాదుపై రైల్వేశాఖ స్పందించింది.

Updated : 20 Jun 2024 19:42 IST

దిల్లీ: సాధారణ రైళ్లతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సెమీహైస్పీడ్‌ వందే భారత్‌ (Vande Bharat) టికెట్‌ ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంది దీనిలోనే ప్రయాణించేందుకు మక్కువ చూపుతున్నారు. తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా ప్రయాణం సౌకర్యంగా ఉండటమే అందుకు కారణం. కానీ, ఈ రైళ్లలోని భోజన సదుపాయాలపై తరచూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా వందేభారత్‌లో ప్రయాణించిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది.

‘‘మా అత్త, మామయ్య భోపాల్‌ నుంచి ఆగ్రాకు వందేభారత్‌ రైల్లో ప్రయాణించారు. రైల్వే సిబ్బంది తీసుకొచ్చిన భోజనంలో వడ్డించిన పప్పులో బొద్దింక రావడంతో షాక్‌కి గురయ్యారు. ప్రయాణికుల ఆరోగ్య సమస్యలపై రైల్వేశాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. క్యాటరింగ్‌ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఓ వ్యక్తి ‘ఎక్స్‌’ వేదికగా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అధికార ఖాతాను కూడా ట్యాగ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చీనాబ్‌ బ్రిడ్జ్‌పై రైలు పరుగులు.. ట్రయల్‌ రన్‌ వీడియో చూశారా..?

నాసిరకం భోజనంపై వచ్చిన ఫిర్యాదుకు ఐఆర్‌సీటీసీ స్పందించింది. ‘‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం. ఈ విషయంలో సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌పై చర్యలు చేపడతాం. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం’’ అని హామీ ఇచ్చింది. వందేభారత్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. ఆహారం నుంచి దుర్వాసన, పెరుగులో ఫంగస్‌ కనిపించడం చర్చకు దారి తీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని