Viral: ఉద్యోగులు బయటికెళ్లకుండా ఆఫీసుకు తాళాలు.. వివాదంలో ఎడ్‌టెక్‌ కంపెనీ

ఉద్యోగుల పట్ల ఓ కంపెనీ అత్యంత అమానవీయంగా వ్యవహరించింది. అనుమతి లేకుండా బయటకు వెళ్లడానికి వీల్లేందంటూ ఆఫీసుకు తాళాలు వేయించింది.

Published : 05 Jun 2023 16:17 IST

గురుగ్రామ్‌: హరియాణా (Haryana)లోని గురుగ్రామ్‌ (Gurugram)కు చెందిన కోడింగ్‌ నింజాస్‌ (Coding Ninjas) అనే ఎడ్‌టెక్‌ (ED-Tech) కంపెనీ చేసిన నిర్వాకం విమర్శలకు దారితీసింది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు బయటకు వెళ్లకుండా కంపెనీ యాజమాన్యం ఆఫీసుకు తాళాలు వేయించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది. అందులో వాచ్‌మెన్‌ ఆఫీసు డోర్‌కు తాళాలు వేస్తూ కన్పించారు. అదేంటని అడిగితే.. ‘‘అనుమతి లేకుండా ఏ ఉద్యోగిని బయటకు పంపించొద్దని మేనేజర్‌ చెప్పారు. బయటకు వెళ్లాలంటే పర్మిషన్‌ తెచ్చుకోండి’’ అని వాచ్‌మెన్‌ చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది.

ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు ఎంటర్‌ప్రెన్యూర్స్‌ తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్‌ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగుల పని వాతావరణం దిగజారుతోంది. ఇంతకంటే దారుణం ఉంటుందా?’’ అంటూ దుయ్యబడుతున్నారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారడంతో కోడింగ్‌ నింజాస్‌ కంపెనీ స్పందించింది.

‘‘ఈ ఘటనపై మేం స్పష్టతనివ్వాలనుకుంటున్నాం. మా కంపెనీకి చెందిన ఒక ఆఫీసులో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఓ ఉద్యోగి చేసిన విపరీత చర్య కారణంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, కొద్ది క్షణాల్లోనే దాన్ని సరిదిద్దాం. సదరు ఉద్యోగి తన పొరబాటును అంగీకరించి క్షమాపణలు కూడా తెలియజేశారు. ఘటన నేపథ్యంలో ఉద్యోగులకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ వ్యవస్థాపకులు కూడా విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మేం చర్యలు తీసుకుంటున్నాం. సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకున్నాం’’ అని కంపెనీ స్పష్టం చేసింది.

అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని, ఇలాంటివి తమ విలువలకు విరుద్ధమని పేర్కొంది. గత ఏడేళ్లుగా భారత యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామని తెలిపింది. అయితే ఈ ఘటన బయటికొచ్చిన తీరు దురదృష్టకరమని, దీని వల్ల అసౌకర్యానికి గురైన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు తెలియజేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని