Cold Waves: ఉత్తరాది గజ గజ.. ఐఎండీ కీలక ప్రకటన

చలి గాలులతో ఉత్తరభారతం గజగజ లాడుతోంది. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది.

Updated : 06 Jan 2023 17:48 IST

దిల్లీ: హిమాలయ వాయవ్య భాగం నుంచి వీస్తున్న చలిగాలులతో (Cold Waves) ఉత్తర భారతం (North India) గజగజలాడుతోంది. దేశ రాజధాని దిల్లీ (Delhi)తో పాటు జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir), హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal pradesh) లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు విపరీతంగా మంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. చలిగాలుల తీవ్రత మరో 24 గంటల పాటు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అయితే, పంజాబ్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశముందని తెలిపింది.

మరోవైపు ట్రోఫోస్పిరిక్‌ ద్రోణి కొనసాగుతుండటం వల్ల జనవరి 7, 8, 9 తేదీల్లో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. 10 నుంచి 13 తేదీల మధ్య కొన్ని చోట్ల మెరుపులతో కూడిన వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. వాయవ్య హిమాలయ ప్రాంతాల్లో వర్ష ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇవాళ దిల్లీలో ఉష్ణోగతలు కనిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. అయానగర్‌ ప్రాంతంలో 1.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్తార్‌ గంజ్‌లో 4 డిగ్రీలు, దిల్లీ రిడ్జ్‌లో 3.3 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని