వ్యాక్సినే కాదు.. భౌతిక దూరమూ ముఖ్యమే

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముప్పు తప్పదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్‌తో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తేనే కరోనా మహమ్మారిని నిర్మూలించగలమని పరిశోధనల్లో వెల్లడైంది.

Published : 22 Feb 2021 19:08 IST

వెల్లడిస్తున్న నివేదికలు

బీజింగ్‌: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముప్పు తప్పదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వ్యాక్సిన్‌తో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తేనే కరోనా మహమ్మారిని నిర్మూలించగలమని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ పరిశోధనకు చెందిన పత్రాలు తాజాగా ‘నేచర్‌ ఆఫ్ హ్యూమన్‌ బిహేవియర్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌, చైనీస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంగ్‌కాంగ్‌ పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు. వివిధ దేశాల్లోని జనసాంద్రత ఆధారంగా ఈ పరిశోధనను నిర్వహించామని వారు తెలిపారు. వ్యాక్సిన్‌ పంపిణీతో పాటు, కఠిన కొవిడ్‌ నిబంధనలు పాటించిన ప్రాంతాల్లోనే కరోనా అదుపులో ఉందని వారు వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకోవడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించినప్పుడే సరైన ఫలితాలు వస్తాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు పూర్తి స్థాయిలో ఇంటికే పరిమితం అవ్వాల్సిన అవసరం లేకపోయినా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో హెర్డ్‌ ఇమ్యునిటీ ఉపకరిస్తుందని వారు తెలిపారు.

‘‘ మా పరిశోధన ప్రభుత్వాలకు కరోనా కట్టడి చర్యలు రూపొందించడంలో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. గతంలో కరోనా కట్టడికి లాక్‌డౌనే మార్గంగా ఉంది. కానీ ప్రస్తుతం వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో మనం కచ్చితంగా మాస్కును ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి నిబంధనలను అనుసరిస్తే కరోనాను త్వరలోనే తరిమికొట్టొచ్చు.’’ అని పరిశోధకుల్లో ఒకరైన షెంగ్జి లాయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని