corruption: రూ.15 లక్షలకు పైబడితేనే అవినీతికి పాల్పడినట్లు..!

రూ.15 లక్షలకు మించితేనే అవినీతికి పాల్పడినట్లని మధ్యప్రదేశ్‌ భాజపా ఎంపీ జనార్థన్‌ మిశ్రా అవినీతికి హద్దులు చెప్పారు. సర్పంచ్‌లు రూ.15లక్షలకు...

Updated : 28 Dec 2021 17:11 IST

మధ్యప్రదేశ్‌: అక్రమాల్లో రూ.15 లక్షలకు మించితేనే అవినీతికి పాల్పడినట్లని మధ్యప్రదేశ్‌ భాజపా ఎంపీ జనార్థన్‌ మిశ్రా అవినీతికి హద్దులు చెప్పారు. సర్పంచ్‌లు రూ.15లక్షలకు పైబడి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే తనను సంప్రదించాలని ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఈ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ‘ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో మీడియా పాత్ర’ అనే సెమినార్‌లో ఎంపీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌ (గ్రామపెద్ద)పై ప్రజలు అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు అతను రూ.15 లక్షల వరకు అవినీతి చేసి ఉంటే తన వద్దకు రావద్దని, రూ.15లక్షలకు పైబడితేనే తన వద్దకు రావాలంటూ పేర్కొనడంతో సెమినార్‌కు హాజరైన వారు కంగుతిన్నారు. సెమినార్‌లో భాగంగా ఎంపీ మాట్లాడుతూ సర్పంచ్‌లు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రజలు పెద్ద ఎత్తున తన వద్దకు వస్తున్నారని తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.7లక్షలు, తదుపరి ఎన్నికల సమయంలో రూ.7లక్షలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా మరో లక్ష ఖర్చుచేస్తున్నారని ఎంపీ అన్నారు.పన్ను ఎగవేత కేసులో పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్‌ జైన్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లా కోర్టు 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన మరుసటి రోజే ఎంపీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జైన్‌ అరెస్ట్‌ కావడం భాజపా, సమాజ్‌వాదీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.జైన్‌తో వివాదాస్పద సంబంధాలు కలిగి ఉన్నట్లు ఒకరి కొకరు ఆరోపణలు సంధించుకున్నారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ (డీజీజీఐ) కాన్పూర్‌లోని జైన్‌ నివాసం, కన్నాజ్‌ ప్రాంతంలోని నివాసం, ఫ్యాక్టరీలపై దాడులు నిర్వహించి సుమారు రూ.257కోట్ల నగదు, 25కిలోల బంగారం, 250కిలోల వెండి స్వాధీనం చేసుకుని జైన్‌ను అరెస్ట్‌ చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని