​​​​​​జడ్జిలను దూషించడం ట్రెండ్‌ అయిపోయింది

న్యాయమూర్తుల పట్ల వ్యక్తిగత దూషణలకు దిగుతుండడం పట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అసహనం వ్యక్తంచేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాని పక్షంలో కొందరు వ్యక్తులు న్యాయమూర్తులను లక్ష్యంగా...

Published : 27 Feb 2021 19:54 IST

పట్నా: న్యాయమూర్తుల పట్ల వ్యక్తిగత దూషణలకు దిగుతుండటం పట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాని పక్షంలో కొందరు వ్యక్తులు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని పరుష పదజాలంతో దూషించే ధోరణి ఇటీవల పెరిగిపోయిందన్నారు. పట్నాలో నూతనంగా నిర్మించిన హైకోర్టు నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తీర్పును మనం తప్పుబట్టొచ్చు గానీ, న్యాయమూర్తులను దూషించడం సబబు కాదని రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఇటీవల సోషల్‌మీడియా వేదికగా దూషణలకు దిగడం ఎక్కువైందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు.. ఇలా కోర్టు ఏదైనా న్యాయశాస్త్రం ప్రకారం తీర్పు వెలువరించే స్వేచ్ఛ న్యాయమూర్తులకు ఉండాలని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ, విమర్శలు, అసమ్మతికి మద్దతిస్తున్నామని, కానీ సోషల్‌మీడియాను దుర్వినియోగం చేయడాన్ని సమంజసం కాదన్నారు. సోషల్‌మీడియా వేదికగా ఎవరైతే దూషణలు ఎదుర్కొంటారో వారికి పరిష్కార వేదిక ఉండాలన్నారు. ఆల్‌ ఇండియా జుడీషియల్‌ సర్వీసెస్‌ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయని చెప్పారు. కొవిడ్‌ వేళా డిజిటల్‌గా పెద్దఎత్తున కేసులను న్యాయవ్యవస్థ పరిష్కరించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని