ప్రముఖుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: కేంద్రం

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన బాటపట్టిన రైతులకు మద్దతుగా విదేశీ ప్రముఖులు స్పందించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది.

Published : 03 Feb 2021 15:13 IST

రైతు ఉద్యమంపై అంతర్జాతీయ స్పందన నేపథ్యంలో..

దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన రైతులకు మద్దతుగా విదేశీ ప్రముఖులు స్పందించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ ఆందోళనలపై ట్విటర్‌లో ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ‘అవాస్తవం, బాధ్యతారాహిత్యం’ అంటూ విదేశాంగశాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. #IndiaTogether, #IndiaAgainstPropaganda అనే హ్యాష్ ట్యాగ్‌లను కూడా దానికి జోడించింది.  

‘కొందరు స్వార్థపరులు ఈ నిరసనల్లో తమ ఎజెండాను అమలు చేయాలని చూడటం దురదృష్టకరం. జనవరి 26న జరిగిన ఘటనల్లో ఇది స్పష్టంగా కనిపించింది. స్వలాభం కోసం కొన్ని వర్గాలు భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించాయి. వీరి అసత్య ప్రచారం కారణంగా కొన్ని మూకలు ప్రపంచంలో పలుచోట్ల మహాత్ముడి విగ్రహాలను అపవిత్రం చేశాయి. ఆ ఘటనలు భారత్‌, నాగరిక సమాజాన్ని తీవ్రంగా బాధించాయి’ అంటూ కేంద్రం ఆ చర్యలను ఖండించింది.  

‘ఈ సున్నితమైన అంశంపై సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న హ్యాష్‌ ట్యాగ్‌లు, కామెంట్లు..ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు చేస్తున్న పోస్టులు పూర్తిగా అవాస్తవం, బాధ్యతారహితమైనవి. దేశంలోని అతి కొద్ది మంది రైతులకు మాత్రమే ఈ వ్యవసాయ సంస్కరణ విషయంలో కొంత అసంతృప్తి ఉంది. ఈ ఆందోళనలను భారత ప్రజాస్వామ్య నీతి, రాజకీయ నేపథ్యంలోనే చూడాలని కోరుకుంటున్నాం. ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు కేంద్రం, రైతు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. 

ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌, పాప్‌ సింగర్ రిహానా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ సమీప బంధువు మీనా హారిస్ రైతులకు సంఘీభావం తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. రైతు ఉద్యమంపై సీఎన్‌ఎన్ ప్రచురించిన కథనాన్ని ‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’ వ్యాఖ్యతో రిహానా ట్వీట్ చేశారు. కాగా, ఆ ట్వీట్ మంగళవారం ట్విటర్‌లో చాలా సేపు ట్రెండ్ అవడం గమనార్హం. థన్‌బర్గ్ కూడా రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ ప్రకటన వెలువడింది. 

ఇవీ చదవండి:

రైతు ఉద్యమానికి థన్‌బర్గ్, రిహానా మద్దతు!

చైనా బెదిరింపులను గమనిస్తున్నాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని