
Lockdown: ఆ రెండు రాష్ట్రాల్లో ఆదివారం పూర్తి లాక్‌డౌన్
ఇంటర్నెట్ డెస్క్: కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు పలు రాష్ట్రాలు పరిస్థితికి తగ్గట్టుగా ఆంక్షలు విధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం ఈ ఆదివారం పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. బస్, రైల్వే స్టేషన్, విమానాశ్రయాల వద్దకు వెళ్లే ఆటోలు, ట్యాక్సీలకు మాత్రం అనుమతిఇచ్చింది. గురువారం తమిళనాడులో 28,561 కొత్త కేసులొచ్చాయి. 39 మంది మరణించారు. మొత్తం కేసులు 30 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య 37 వేలకు పైనే ఉంది. ఈ నెలాఖరుకల్లా 10 లక్షల మందికి ప్రికాషనరీ డోసు అందుతుందని ఆ రాష్ట్రం అంచనా వేస్తోంది.
కేరళ కూడా అదే దారిలో.. మూడోవేవ్‌తో తీవ్ర ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రం.. వచ్చే రెండు ఆదివారాలు పూర్తి లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించుకుంది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. జనవరి 23, జనవరి 30 తేదీల్లో ఈ లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గురువారం కేరళలో 46 వేల మందికి పైగా వైరస్ బారినపడ్డారు.
మరోవైపు కర్ణాటక మాత్రం ఆంక్షలను కాస్త సడలించింది. వారాంతపు కర్ఫ్యూను తక్షణమే ఎత్తివేసింది. అయితే రాత్రి ఆంక్షలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. మాల్స్, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయని ప్రభుత్వం పేర్కొంది.